న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, ఆ సంస్థ దేశ రాజకీయాల్లో తలదూరుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ట్విట్టర్ అకౌంట్‌ను ఆ సంస్థ తాత్కాలికంగా బ్లాక్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఆయన తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయాలకు అనుగుణంగా నడిచే కంపెనీలకే మన దేశంలోకి అనుమతినిస్తారా అని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ శుక్రవారం యూ ట్యూబ్‌లో ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా అకౌంట్‌ను బ్లాక్ చేయడమంటే మన దేశ రాజకీయాల్లో ఆ సంస్థ తలదూర్చడమే. మన రాజకీయాలతో ఆ సంస్థ వ్యాపారం చేసుకుంటోంది.
ఒక రాజకీయ నాయకుడిగా నాకీ విషయం మింగుడు పడడం లేదు’’ అని రాహుల్ అన్నారు. తనకు ట్విట్టర్‌లో 2 కోట్ల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారని తన అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా వారి అభిప్రాయాల్ని వెల్లడించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య నిర్మాణంపైనే దాడి అని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ట్విట్టర్ తటస్థ వేదిక కాదని రాహుల్ ఆరోపించారు. ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఫొటోలను రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయడంతో, అది నిబంధనలకు విరుద్ధమంటూ ఆయన ఖాతాని నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపైనా చర్యలు తీసుకోండి :ఎన్‌సీపీసీఆర్
మరోవైపు రాహుల్ గాంధీ బాధిత కుటుంబం ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేయడంపై పిల్లల హక్కుల పరిరక్షణ అత్యున్నత సంస్థ (ఎన్íసీపీసీఆర్) మండిపడింది. ఆ ఖాతాపైన కూడా చర్యలు తీసుకోవాలని ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment