ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌పై ముంబై పోలీసులకు రెండు ఫిర్యాదులు అందాయి. ఈనెల 9న సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన ఓ వీడియోలో ముఖ్యమంత్రి ఠాక్రేను ఉద్దేశించి ఆయన ప్రతిష్టను దెబ్బతీసే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ ఫిర్యాదు అందినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడంతో పాటు ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారని ఓ ఫిర్యాదిదారు పేర్కొన్నారు.
ముంబైలోని తన కార్యాలయాన్ని బీఎంసీ కూలదోయడంపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగనా సీఎం ఠాక్రేపై ధ్వజమెత్తుతూ బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ఆమె ముఖ్యమంత్రిని ఉద్దేశించి..‘ఉద్ధవ్ ఠాక్రే..మీరు ఏమనుకుంటున్నారు? ఫిల్డ్ మాఫియాతో కుమ్మక్కై మీరు నా ఇంటిని కూల్చివేసి నాపై పగతీర్చుకున్నారా..? ఈరోజు నా ఇంటిని కూల్చారు..రేపు మీ అహంకారం కూలుతుంద’ని కంగనా పేర్కొన్నారు. కాగా కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక సుశాంత్ మృతికి సంబంధించి ముంబై పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదన్న బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై విశ్వాసం లేకపోతే నగరంలో ఉండరాదని కంగనాను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం చెలరేగింది. చదవండి : ఠాక్రే-పవార్ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!
Comments
Please login to add a commentAdd a comment