ఉదయ్‌పూర్: తన భర్త భయపడినట్టుగానే జరిగిందని రాజస్థాన్ టైలర్ కన్హయ్యా లాల్ తెలి భార్య జశోద తెలిపారు. ప్రాణభయంతో గత వారం రోజుల నుంచి తన భర్త దుకాణానికి వెళ్లడం లేదని వెల్లడించారు. అంత్యక్రియలకు ముందు బుధవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏడు రోజుల తర్వాత తిరిగి షాపునకు వెళ్లిన తన భర్తను దుండగులు దారుణంగా హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 18, 21 వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి భవిష్యత్‌పై బెంగగా ఉందని జశోద వాపోయారు.
48 ఏళ్ల కన్హయ్యా లాల్ మంగళవారం ఉదయ్‌పూర్‌లోని తన దుకాణంలో దారుణ హత్యకు గురయ్యారు. కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిని చంపేశారు. మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు కన్హయ్యా లాల్‌ను హత్య చేశారు.
అయితే ఈ వివాదంలో కన్హయ్యా లాల్‌ను జూన్ 10న అరెస్ట్ చేసినట్టు రాజస్థాన్ పోలీసులు తెలిపారు. చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని అతడు జూన్ 15న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కన్హయ్యా లాల్‌పై ఫిర్యాదుచేసిన వారితో పోలీసులు చర్చలు జరపడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనబడింది. దీంతో తనకు పోలీసుల సహాయం అవసరం లేదని కన్హయ్యా లాల్ రాతపూర్వకంగా పేర్కొన్నాడు.
నాకూ బెదింపులు వస్తున్నాయి: జిందాల్
తనకు కూడా దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బీజేపీ బహిష్కృత నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ బుధవారం వెల్లడించారు. ‘ఈ ఉదయం 6.43 గంటలకు నాకు మూడు ఈమెయిల్స్ వచ్చాయి. కన్హయ్య లాల్ గొంతు కోసిన వీడియో కూడా అందులో జతచేశారు. నన్ను, నా కుటుంబాన్ని బెదిరించారు. పోలీసులకు సమాచారమిచ్చాన’ని నవీన్ కుమార్ జిందాల్ హిందీలో ట్వీట్ చేశారు. (క్లిక్: ఉదయ్‌పూర్ టైలర్ హత్యలో ఉగ్రకోణం?)
Comments
Please login to add a commentAdd a comment