శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సీటు కీలకమైన సీటుగా పేరొందింది. సెప్టెంబర్ 25న లాల్ చౌక్ స్థానానికి రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఈ సీటు నుంచి ఇతర అభ్యర్థులతో పాటు మామ, మేనల్లుడు కూడా తలపడుతున్నారు.
లాల్ చౌక్ నుంచి అప్నీ పార్టీ సీనియర్ నేత అష్రఫ్ మీర్, పీడీపీ యువ అభ్యర్థి జుహైబ్ యూసుఫ్ మీర్ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసకు మామా- మేనల్లుడు. గతంలో అష్రఫ్ మీర్ పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుండి పోటీచేసి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఓడించారు. అయితే 2018లో బీజేపీ, పీడీపీ కూటమి తెగిపోవడంతో అష్రఫ్ మీర్ పీడీపీని వీడి అల్తాఫ్ బుఖారీ సొంత పార్టీ అయిన అప్నీలో చేరారు. కాగా జుహైబ్ బ్రిటన్ నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పట్టా పొందారు. మెహబూబా ముఫ్తీ అతనికి లాల్ చౌక్ నుండి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో లాల్ చౌక్‌లో మామ- మేనల్లుడు పోరు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు జమ్ము కశ్మీర్ చరిత్రలో ఏనాడూ ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈసారి లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన బలాన్ని చాటే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి అజాజ్ హుస్సేన్ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించి, ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత బీజేపీ ఇక్కడ పలు అభివృద్ధి పనులు చేసిందని మోదీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Comments
Please login to add a commentAdd a comment