TIME: 15:00
► శక్రవారం ఉదయం 10 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది.
► కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గతంలో 'యువరాజు' లాగా ప్రవర్తించేవాడని, ఇప్పుడు తానే ను భారతదేశానికి 'రాజు' అని భావిస్తున్నాడని చురకలంటించారు.
► లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సరైన పార్లమెంటరీ విధానాన్ని అనుసరించడం లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం కాంగ్రెస్ సభ్యుడు, ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. తాను మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ మరో ఎంపీకి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంతో.. స్పీకర్ స్పందిస్తూ అనుమతి ఇవ్వడానికి మీరు ఎవరు? మీరు అనుమతి ఇవ్వలేరు, అది నా హక్కు అని స్పష్టం చేశారు.
► ఏపీలో ప్రషాద్ (PRASHAD) పథకంలో అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలు ఉన్నాయయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు వాటిని ఈ పథకంలో చేర్చామని మంత్రి పేర్కొన్నారు. అమరావతికి 2015-16లో రూ.27.77 కోట్లతో పర్యాటక గమ్యస్థానం కింద అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం ఆలయాభివృద్ధి కోసం రూ.37.88 కోట్ల ఖర్చు చేశామని పేర్కొన్నారు.
► లోక్‌సభలో విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశానికి సంబంధించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కొత్త రైల్వే జోన్ ఏర్పటుపై డీపీఆర్ అందిందని ఆయన పేర్కొన్నారు.
► రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపీదేవి వెంకటరమణ ఏపీలో ఆక్వా టూరిజం అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ.. ఏపీలోని కాకినాడ, నెల్లూరులో ఆక్వా టూరిజం అభివృద్ధి చేస్తున్నామని సమాధానం ఇచ్చారు.
► పెగాసస్ అంశంపై పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై వచ్చిన ప్రివిలేజ్ మోషన్‌లను పరిశీలిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
► రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. హైకోర్టులు, సుప్రీంకోర్టులలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తుల్లో తొలిసారిగా నలుగురు మహిళా న్యాయమూర్తులు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాను న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ముగ్గురిని నియమించారని తెలిపారు. హైకోర్టుల్లోని 1098 మంది న్యాయమూర్తుల్లో, 83 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు.
► చాలా విరామం తర్వాత బుధవారం రాజ్యసభ అంతరాయం లేకుండా సజావుగా కొనసాగిందని చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ స్ఫూర్తి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నాలుగో రోజు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని బుధవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment