సాక్షి, ఢిల్లీ: కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. అమిత్ షా నేటి నుంచి మూడు రోజుల పాటు మణిపూర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సంక్షోభం నివారణ దిశగా ఆయన పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇంఫాల్‌లో పరిస్థితులను అమిత్ షా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఇక, హోంమంత్రి పర్యటన వేళ అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా, తాజాగా మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సాయుధ కుకి మిలిటెంట్లు ప్రత్యర్థి మైతి వర్గానికి చెందిన ఎనిమిది కొండ ప్రాంత గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోగా, 10 మంది వరకు గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కక్చింగ్ జిల్లాలో మిలిటెంట్లు శనివారం అర్ధరాత్రి మైతీ వర్గానికి చెందిన వారి 80 ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో, గ్రామస్తులు భయంతో ఇళ్లు వదిలి తలోదిక్కుకు పారిపోయారు.
అటు, బిష్ణుపూర్ జిల్లాలో కుకి మిలిటెంట్లు మైతీ వర్గం ప్రజలకు చెందిన 30 ఇళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు నిషేధాజ్ఞల సడలింపు సమయాన్ని 11 గంటల నుంచి 6 గంటలకు కుదించారు. కుకీలు దాడులు చేస్తున్నా భద్రతా బలగాలు పట్టించుకోవడం లేదంటూ ఇంఫాల్ వెస్ట్ జిల్లా ఫయెంగ్ గ్రామానికి చెందిన మహిళలు నిరసనకు దిగారు. ఇక, షెడ్యూల్ తెగ(ఎస్‌టీ) హోదా విషయమై రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి కుకి, మైతి వర్గాల మధ్య మొదలైన ఘర్షణల్లో 75 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు తాజా ఘటనలపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్నది జాతుల మధ్య వైరం కాదు. కుకి మిలటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరు’గా ఆయన అభివర్ణించారు. పౌరులపై కాల్పులకు దిగుతూ, ఇళ్లకు నిప్పుపెడుతున్న 40 మంది తీవ్రవాదులను ఇప్పటి వరకు బలగాలు చంపినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రారంభోత్సవమా? పట్టాభిషేకమా?
Comments
Please login to add a commentAdd a comment