ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత దేశంలో రోజురోజుకి పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 50 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో రోడ్డురవాణా,రహదారులు,ఎంఎస్‌ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా తెలియ జేశారు. కొద్దిగా అనారోగ్యం అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని, పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని గడ్కరీ ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఆరోగ్యంగానే ఉన్నాననీ, ఐసోలేట్ అయ్యానని చెప్పారు. అలాగే తనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని , ప్రోటోకాల్‌ను అనుసరించాలని అభ్యర్థించారు. సురక్షితంగా ఉండాలని సూచించారు.
కాగా పార్లమెంటు సమావేశాలకు ముందు సభ్యులకు నిర్వహించిన తప్పనిసరి కోవిడ-19 పరీక్షల్లో17మంది, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభకు చెందిన ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా గడ్కరీకి కూడా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన సోమవారం పార్లమెంటుకు హాజరైనట్టు తెలుస్తోంది. పార్లమెంటులో 25మంది సభ్యులు (ఎంపీలు), పార్లమెంటులో పనిచేస్తున్న 40మందికి పాజిటివ్ వచ్చిందని మింట్ తెలిపింది. పార్లమెంటు సభ్యులైన మీనాక్షి లేకి, హనుమాన్ బెనివాల్, సుకాంత మజుందార్ తదితరులకు కరోనా నిర్దారణ అయింది. మరోవైపు గడ్కరీ ప్రస్తుతం నాగ్‌పూర్‌లో ఉన్నారని, స్వల్పంగా జ్వరం ఉందని ఆయన కార్యాలయం తెలిపింది. తాజా పరిణామంతో ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గడ్కరీ దూరం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment