పాలమూరు: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మళ్లీ ఇప్పుడు కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో మళ్లీ అలజడి మొదలైంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మంగళవారం 14 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 20 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది.
జిల్లాకేంద్రంలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పీఆర్‌ఓగా పని చేస్తున్న సదరు యువకుడికి స్వల్ప లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ వెల్లడించారు.
సదరు యువకుడి శాంపిల్స్ గాంధీ ఆస్పత్రిలోని ల్యాబ్ పంపించి ఏ రకం వైరస్ అని తెలుసుంటామని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఐదు రోజులుగా 151 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా ఆరోగ్యశాఖతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పడకలు సిద్ధం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, పీపీ, పీసీఆర్ కిట్స్, మందుల ఇతరత్రా సామగ్రిని సమకూర్చారు.
వాతావరణంలో మార్పుల వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉందని, జాతర్లు, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుంపులుగా వెళ్లడం, జన సమూహంలో ప్రయాణించడం వల్ల కరోనా వైరస్ త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment