సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయినిగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ గురువారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. 8 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చింది రూ.11,182 కోట్లు అని ప్రకటించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం రూ.11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్ పనులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునఃనిర్మాణం పనులతోపాటు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మొత్తం రూ.55,657 కోట్లు ఖర్చవుతుందని సవరించిన అంచనాలు చెబుతుంటే 8 ఏళ్ల వ్యవధిలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ.11,182 కోట్లు మాత్రమేనని మంత్రి తెలిపిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల వివరాలను కూడా మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ సవివరంగా తన జవాబులో తెలిపారు.
- ఏప్రిల్ 2018 నుంచి మార్చి 2019 వరకు రాష్ట్రంలో 88 కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల అమలు కోసం రూ.10,632 కోట్లు విడుదల
- ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు రాష్ట్రంలో 84 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ.11,112 కోట్లు విడుదల
- ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు 79 కేంద్ర పథకాల అమలు నిమిత్తం రూ.12,904 కోట్లు విడుదల
- ఏప్రిల్ 2021 నుంచి జూలై 2021 వరకు రాష్ట్రంలో అమలుచేస్తున్న 31 కేంద్ర పథకాల కోసం రూ.1,794 కోట్లు విడుదల
Comments
Please login to add a commentAdd a comment