
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో ఉద్యోగులు ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అక్టోబర్ 16 తర్వాత ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని స్పష్టం చేసింది. కనీసం ఒక్క డోస్ టీకా కూడా వేసుకోని వారిని ఆఫీసు విధులకు హాజరు కానివ్వబోమని తెలిపింది. ఉపాధ్యాయులు, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలతో సహా వ్యాక్సిన్ వేయించుకోని ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీసం ఒక డోస్ వేయించుకొనే వరకు ‘సెలవు’గా పరిగణిస్తామని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయంలో సంబంధిత విభాగాల అధిపతులు ఆరోగ్య సేతు యాప్/ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగుల హాజరును ధృవీకరిస్తారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీడీఎంఏ కార్యనిర్వాహక కమిటీ ఛైర్‌పర్సన్ విజయ్ దేవ్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే విషయం పరిశీలించవచ్చని డీడీఎంఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment