బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల భయోత్పాతం కొనసాగుతూనే ఉంది. తాజాగా హర్ది ప్రాంతంలో అవి ఓ పసికందును పొట్టన పెట్టుకున్నాయి. ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి గాయపరిచాయి. దాంతో గత రెండు నెలల్లో తోడేళ్లకు బలైన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులే! 34 మంది గాయపడ్డారు. ఆరు తోడేళ్లలో నాలుగింటిని పట్టుకోగా రెండు మాత్రం నిత్యం అధికారులకు చుక్కలు చూపుతున్నాయి.
ఆవాసాలు మారుస్తూ, రోజుకో గ్రామాన్ని లక్ష్యం చేసుకుంటూ తప్పించుకుంటున్నాయి. తప్పనిసరైతే వాటిని కాల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దాంతో ట్రాంక్విలైజర్లతో షూటర్లను రంగంలోకి దించారు. తోడేళ్లను గుర్తించి పట్టుకునేందుకు, వీలవని పక్షంలో మట్టుపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ‘ఆపరేషన్ భేడియా’కీలక దశకు చేరిందని బహ్రయిచ్ డీఎఫ్‌వో అజీత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్ల పీడ విరగడయ్యేదాకా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
బహ్రయిచ్‌లో మంగళవారం తెల్లవారుజాము 3.35గంటలకు మహసీ సబ్ డివిజన్‌లోని నౌవన్ గరేతి గ్రామంలో తోడేలు ఓ ఇంట్లో దూరి అంజలి అనే రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లింది. షాక్‌కు గురైన తల్లి అరిచేలోపే పాపను నోట కరుచుని పారిపోయింది. రెండు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో చేతుల్లేకుండా చిన్నారి మృతదేహం దొరికింది. అనంతరం ఉదయాన్నే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని కొటియా గ్రామంలో వరండాలో నిద్రిస్తున్న కమలాదేవి (70) అనే వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఆమె అరుపులతో కుటు ంబీకులు అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో అరగంట తరువాత మూడో దాడిలో సుమన్ దేవి (65) అనే మరో వృద్ధురాలు గాయపడింది. సోమవారం రాత్రి పండోహియా గ్రామంలో తోడేళ్ల దాడిలో గాయపడ్డ అఫ్సానా అనే ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి హర్ది దర్హియా గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసింది. మెడను కరిచి లాక్కెళ్లబోయింది. తో డేలుతో తల్లి ధైర్యంగా పోరాడి తన బాబును కాపాడుకోగలిగింది. అదే రాత్రి మరో 50 ఏళ్ల వ్యక్తిపైనా తోడేలు దాడి జరిగింది.
శ్మశాన నిశ్శబ్దం...
తోడేళ్ల దెబ్బకు బహ్రయిచ్‌లో మార్కెట్లు మూతపడ్డాయి. వీధులు పగలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మహసీ సబ్ డివిజన్‌లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభావిత సీతాపూర్, లఖింపూర్ ఖేరి, పిలిభీత్, బిజ్నోర్ డివిజన్లలోనూ తోడేళ్ల భయం నెలకొని ఉంది. ఆ ప్రంతాలకు అదనపు ఫారెస్ట్ గార్డులు, ట్రాప్ బృందాలను పంపుతున్నారు. తోడేళ్లు నిత్యం తమ ఆవాసాలను మారుస్తుండటంతో పట్టుకోవడం కష్టమవుతోందని జిల్లా మేజి్రస్టేట్ మోనికా రాణి తెలిపారు. ‘‘అవి తెలివిగా ప్రతిసారీ కొత్త గ్రామా న్ని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా నాలుగింటిని పట్టుకున్నాం. ఇంకో రెండు దొరకాల్సి ఉంది’’అన్నారు. తమ బృందం నిరంతరం గస్తీ కాస్తోందని, వాటినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సెంట్రల్ జోన్) రేణుసింగ్ చెప్పారు. పిల్లలను ఇళ్ల లోపలే ఉంచాలని, రాత్రిపూట తలుపులకు తాళం వేసుకోవాలని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
వీడియో ఆధారాలడిగారు...
తోడేళ్లు తమ ఇళ్ల పక్కనే కనిపిస్తూ వణికిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులకు చెబితే వీడియో ఆధారాలు అడుగుతున్నారని మండిపడుతున్నారు. ‘‘మా ఇంటి పక్కన తోడేలు కనిపిస్తే కుక్కనుకొని తరిమికొట్టాం. పొలాల వైపు పరుగెత్తడంతో తోడేలని గుర్తించాం. దాంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారా, లేరా అని చూసుకున్నాం. అంజలి తోడేలు బారిన పడిందని తేలింది’’అని నౌవన్ గరేతికి చెందిన బాల్కే రామ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment