![Uttarakhand CM Tirat Singh Rawat Tests Positve: Delhi Tour Postponed - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/22/Tirath-Singh-Rawat.jpg.webp?itok=COgikZnS)
న్యూఢిల్లీ: ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తీరత్‌సింగ్ రావత్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. మోదీని కలిసే ముందే తీరత్‌సింగ్ రావత్‌కు తాను కరోనా బారిన పడిన విషయం తెలియడంతో కలకలం రేపింది. అతడికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా తెలిసి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా మహమ్మారి సోకి ఉండే అవకాశం ఉండేది.
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించుకుని నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనకు తీరత్ సింగ్ సిద్ధమయ్యారు. వాస్తవంగా సోమవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే ఆలోపే ఆయన కరోనా బారిన విషయం తెలియడంతో ఉన్నపళంగా ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.
‘పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కానీ నేను ఆరోగ్యంగా ఉన్నా. వైద్యుల సలహాతో స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలి. జాగ్రత్తలు తీసుకోండి. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా’ అని తీరత్‌సింగ్ ట్విటర్‌లో తెలిపారు. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నారు. ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment