Tirath Singh Rawat
-
సీఎం పదవికి రాజీనామా: నాలుగో వ్యక్తి రూపానీ.. ముందు ముగ్గురు ఎవరంటే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్లో బీజేపీ కీలక మార్పులకు తెర తీసింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం తన పదవికీ రాజీనామా చేశారు. పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ అధిష్టానం విజయ్ రూపానీతో రాజీనామా చేయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. తదుపరి సీఎం రేసులో ఉన్న వారి పేర్లు చూస్తే ఈ వార్తలు వాస్తవమే అనిపిస్తున్నాయి. గుజరాత్ కొత్త సీఎం రేసులో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, ఎంపీ సీఆర్ పటేల్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుజరాత్ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించబోయేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల్లో ఇలా ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నాల్గవ వ్యక్తి. గతంలో కర్ణాటక, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల చేత బీజేపీ అధిష్టానం ఇలానే రాజీనామా చేయింది. రాజీనామాలు చేయించడం ఎందుకు.. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లో విజయం కోసం బీజేపీ వేర్వేరు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత సీఎం పనితీరు, వారిపై ఉన్న వ్యతిరేకత-వివాదాలు, ఆయా రాష్ట్రాల్లో పార్టీకి మేజర్ ఓటు బ్యాంకు ఇలా తదితర అంశాల ఆధారంగా బీజేపీ పావులు కదుపుతోంది. తాజాగా కర్ణాటక, గుజరాత్లో పరిశీలించినట్లయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ మెజారిటీ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే సీఎంల చేత రాజీనామా చేయించింది. ఈ క్రమంలో యడ్డీ రాజీనామా తర్వాత కర్ణాటకలో తనకు గట్టి మద్దతుదారులైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మైనే ముఖ్యమంత్రిగా నియమించింది. ఇక గుజరాత్లో కూడా పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇవ్వనున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఇక బీజేపీ ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించిన మిగతా రాష్ట్రాలు ఏవి అంటే.. 1. జూలై 2021: కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్డీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తర్వత.. ఈ ఏడాది జూలై 26 న, బీఎస్ యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. యడ్డీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన, అతడి కుమారుడిపై పెద్ద ఎత్తున ప్రజాగ్రాహం వెల్లడయ్యింది. అంతేకాక పార్టీ రాష్ట్ర విభాగంలోని ఒక నిర్దిష్ట విభాగం యడ్డీని పదవి నుంచి తొలగించాలని బీజేపీ అధిష్టాన్నాన్ని డిమాండ్ చేసింది. యడియూరప్పపై పెరుగుతున్న ఆగ్రహం.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ యడ్డీ చేత రాజీనామా చేయించింది. 75 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పరిమితి కారణంగానే 78 ఏళ్ల యడ్డీ చేత రాజీనమా చేయించినట్లు బీజేపీ తెలిపింది. ఆయన స్థానంలో బీజేపీ తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించింది. బొమ్మై గతంలో యడ్డీ మంత్రివర్గంలో హోంమినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. (చదవండి: బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై) 2. జూలై 2021: ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామా మార్చి 2021 లో త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామాను సమర్పించిన తర్వాత తీరథ్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తీరథ్ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం చేత ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మార్చిలో పదవి చేపట్టినప్పటి నుంచి అమ్మాయిల చిరిగిన జీన్స్‌పైన, ఆధ్యాత్మికతతో కరోనాపై పోరాటం లాంటి తీరథ్ వ్యాఖ్యలు పలు వివాదాలు రేపాయి. కరోనా రెండో ఉద్ధృతి వేళ కుంభమేళా నిర్వహణ తెచ్చిన చెడ్డపేరు, పార్టీలోనూ – పాలనలోనూ గందరగోళం... ఇలా అన్నీ కలిసి ఆయనకు పదవీగండం తెచ్చాయి. ఫలితంగా తీరథ్ ఈ ఏడాది జూలై 2021న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. (చదవండి: ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా..) 3. మార్చి 2021: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి 9 వ తేదీన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2017, మార్చి 18న రావత్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 57 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే పార్టీలోని చాలా మంది నాయకులు రావత్ ముఖ్యమంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రావత్ తమ మాట వినలేదని ఫిర్యాదు చేశారు. రావత్ పని తీరును కూడా వారు వ్యతిరేకించారు. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో రావత్‌ను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. ఈ మీటింగ్ అనంతరం రావత్ తన రాజీనామాను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు రాజ్‌భవన్‌లో సమర్పించారు. ఆయన స్థానంలో తీరత్ సింగ్ తెరపైకి వచ్చారు. ఆయన కూడా నాలుగు నెలల్లో రాజీనామా చేయడం గమనార్హం. తాజాగా విజయ్ రూపానీ రాజీనామా చేసిన నాల్గవ సీఎంగా నిలిచారు. చదవండి: అనివార్యతే వేటుకి కారణమైందా? -
నాలుగు నెలల్లో మూడో కృష్ణుడు
నాలుగునెలలు.. ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఒకే పార్టీ. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లోని రాజకీయ ఊగిసలాటకు ఇది ఓ దర్పణం. ఇరవై ఒక్కేళ్ళ చరిత్ర గల ఉత్తరాఖండ్‌లో ఇప్పటికి 11 మంది ముఖ్యమంత్రులైతే, అందులో ఒకరికి ముగ్గురు సీఎంలను తాజా బీజేపీ హయాంలోనే జనం చూశారు. తాజాగా ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ స్థానంలోకి పుష్కర్‌సింగ్ ధామీ రావడంతో దేవభూమిగా పేరుపడ్డ ఉత్తరాఖండ్ రాజకీయ రంగస్థలిపైకి ముచ్చటగా మూడో కృష్ణుడు వచ్చిన ట్టయింది. అధికార పక్షం న్యాయపరమైన చిక్కులను సాకుగా చెబుతూ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, కొద్ది నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇది రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు చేసిన ముఖ్యమంత్రి మార్పు అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉత్తరప్రదేశ్ నుంచి విడివడి ఏర్పడిన ఉత్తరాఖండ్ ఎప్పటిలానే తన రాజకీయ అస్థిరత రికార్డును మరోసారి నిలబెట్టుకున్నట్టయింది. 2017లో మోదీ ప్రజాదరణ హవా ఆసరాగా ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి అధికారపక్షానికి బాలారిష్టాలే. మొదట త్రివేంద్ర రావత్, తరువాత తీరథ్ సింగ్ రావత్, ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామీ – ఒకరి తరువాత ఒకరు గద్దెనెక్కారు. తాజా సీఎంకు ముందున్న ఇద్దరి హయాంలోనూ పార్టీ ఇమేజ్ దిగజారడం గమనార్హం. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలోనూ అంతర్గత కలహాలు అనేకం బయటపడ్డాయి. చార్ధామ్ పుణ్యక్షేత్రాలైన బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి – నాలుగింటినీ చార్ధామ్ దేవస్థానం బోర్డు కిందకు తేవాలన్న త్రివేంద్ర నిర్ణయం తీవ్ర విమర్శలు, వ్యతిరేకత తెచ్చింది. దాంతో, ఆయన స్థానంలో ఈ ఏడాది మార్చిలో తీరథ్‌ను తెచ్చిపెట్టారు. త్రివేంద్ర తీసుకున్న అనేక నిర్ణయాలను తిరగదోడిన తీరథ్ ఇప్పుడిలా నాలుగునెలలకే సీఎం సీటుకు గుడ్‌బై కొట్టాల్సి రావడం కొంత ఆయన స్వయంకృతమే. మార్చిలో పదవి చేపట్టినప్పటి నుంచి అమ్మాయిల చిరిగిన జీన్స్‌పైన, ఆధ్యాత్మికతతో కరోనాపై పోరాటం లాంటి తీరథ్ వ్యాఖ్యలు పలు వివాదాలు రేపాయి. కరోనా రెండో ఉద్ధృతి వేళ కుంభమేళా నిర్వహణ తెచ్చిన చెడ్డపేరు, పార్టీలోనూ – పాలనలోనూ గందరగోళం... ఇలా అన్నీ కలిసి ఆయనకు పదవీగండం తెచ్చాయి. తీరథ్ నిజానికి ఎమ్మెల్యే కూడా కాదు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో కొనసాగాలంటే, ఆరు నెలల లోపలే చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ, కోవిడ్–19 వల్ల ఉప ఎన్నికలు జరిగి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేకపోయిందనీ, ‘ప్రస్తుతమున్న రాజ్యాంగ సంక్షోభ పరిస్థితుల రీత్యా’ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తు న్నాననీ ఆయన డాంబికాలు పోయారు. కోవిడ్ సాకును ఆయన కవచంగా వాడుకుంటున్నా, వాస్తవం వేరు. నిజానికి, తీరథ్ తన ఎన్నికపై స్పష్టత కోసం గత నెలలో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ వెళ్ళారు. పార్టీ సైతం నైనిటాల్లో మూడు రోజులు ‘చింతన్ బైఠక్’ జరిపి మల్లగుల్లాలు పడింది. చివరకు, అధికారులపై అతిగా ఆధారపడుతూ, పరిపాలనలో ముద్ర వేయలేకపోయిన తీరథ్‌ను తప్పిస్తేనే మంచిదని అధిష్ఠానం భావించింది. ఫలితమే తీరథ్ స్థానంలో ధామీకి పట్టాభిషేకం. కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఒక రకంగా ఇది ముళ్ళకిరీటమే. 21 ఏళ్ళ ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలో ఆ పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయసు వ్యక్తి ఆయనే. మాజీ సీఎం కోష్యారీ వద్ద ప్రత్యేక విధుల అధికారిగా పనిచేసి, స్వయంగా సీఎం కావడం ధామీకి దక్కిన అరుదైన ఘనత. చెప్పుకోవడానికి రికార్డుగా అది బాగానే ఉన్నా, చిక్కులూ చాలానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ కనీసం మామూలు మంత్రి పదవి చేసిన అనుభవమైనా ధామీకి లేదు. ఏబీవీపీతో అనుబంధ మున్నా, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సీనియర్లను సమన్వయం చేసు కుంటూ, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అందరినీ ఒక్క తాటిపై నడిపించడం కూడా నల్లేరుపై బండి నడకేమీ కాదు. కుమావూ ప్రాంతంలోని ఖతిమా నుంచి గడచిన రెండు ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు. నలభై అయిదేళ్ళ ధామీకి ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆరెస్సెస్)తోనూ, ఏబీవీపీ లాంటి దాని అనుబంధ సంస్థలతోనూ ముప్ఫయ్యేళ్ళ పైగా అనుబంధం. అలా పార్టీని నడిపే సిద్ధాంతాలు, పార్టీ యంత్రాంగం పనితీరుపై సంపాదించిన అనుభవమే ఆయనకిప్పుడు పెట్టుబడి. మరికొద్ది నెలల్లోనే 2022లో జరిగే ఆ రాష్ట్ర ఎన్నికల్లో సీఎంగా పార్టీకి సారథ్యం వహించడానికి అది సరిపోతుందా అన్నది ఇప్పుడు ప్రశ్న. పాలన ఆఖరేడులో బీజేపీ ఇలా తక్షణ పరిష్కారాలు వెతుకుతూ, పదే పదే సీఎంలను మార్చడం ప్రతిపక్షాల చేతిలో బలమైన అస్త్రం కానుంది. వరుసగా రెండుసార్లు బీజేపీ ఆ రాష్ట్రంలో గెలిచిన చరిత్ర లేదు. పైపెచ్చు, 2017 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి రకరకాల కారణాలతో అక్కడ ఆ పార్టీ ప్రతిష్ఠ మసకబారుతూ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, కుంభమేళాతో వచ్చిపడ్డ ప్రజారోగ్య సంక్షోభం దానికి తోడయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లోనూ అధికారం నిలబెట్టుకోవడం ఆ పార్టీకీ, కొత్తగా పగ్గాలు చేపట్టిన ధామీకీ పెద్ద సవాలే. ధామీ వచ్చీ రాగానే, ప్రతిపక్షాలు ‘అఖండ భారత్’ పేరిట ఆయన చేసిన పాత సోషల్‌మీడియా వ్యాఖ్యలను వెలికితీసి, విమర్శలకు పదును పెట్టడం భవిష్యత్ పోరాటాలకు ఓ మచ్చుతునక. అయితే, రాష్ట్రాలకు తాయిలాల మొదలు ఎన్నికల నిర్వహణ దాకా కేంద్రం కనుసన్నల్లోనే సాగడం రాష్ట్ర బీజేపీకి అనుకూలం. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన దార్శనికత, పార్టీకి అవసరమైన ఎన్నికల చతురత చూపాల్సింది మాత్రం కొత్త ముఖ్యమంత్రే! -
కొత్త సీఎంకు పాత మ్యాప్ కష్టాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌కు కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పుష్కర్ సింగ్ ధామికి గతంలో ఎప్పుడో షేర్ చేసిన ఒక మ్యాప్ కారణంగా తలనొప్పులు ఆరంభమయ్యాయి. ఆరేళ్ల క్రితం అఖండ్ భారత్ పేరిట ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పటంలో ప్రస్తుత భారత భూభాగాలు లేకపోవడం వివాదానికి కారణమైంది. పుష్కర్‌కు ముందు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రావత్, పదవి చేపట్టిన కొద్దిరోజులకే చిరిగిన జీన్స్‌పై కామెంట్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! తాజాగా పుష్కర సింగ్ ధామీకి అర్ధ పుష్కర కాలం నాటి మ్యాప్ చిక్కులు తెచ్చిపెట్టింది. 2015లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అఖండ్ భారత్ కల సాకారం కావాలని పేర్కొంటూ ఒక మ్యాప్‌ను పుష్కర్‌సింగ్ అప్పట్లో ట్వీట్ చేశారు. అయితే భారత్‌లో అంతర్భాగంగా ఉన్న లద్దాఖ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు ఆ మ్యాప్‌లో లేకపోవడంతో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సీఎంగా ప్రమాణం ఆదివారం ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11మంది మంత్రులతో గవర్నర్ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రావత్ కేబినెట్లో పనిచేసిన వారినే పుష్కర్ తన టీంలోకి తీసుకున్నారు. కొత్తగా ఎవరికీ అవకాశం దక్కలేదు. రావత్ ప్రభుత్వంలో సహాయ మంత్రులుగా ఉన్నవారికి సైతం ఈ దఫా కేబినెట్ ర్యాంకులు దక్కాయి. పుష్కర్‌ను సీఎంగా ఎంపిక చేయడంపై అంతకుముందు రాష్ట్ర బీజేపీలో అసమ్మతి రాగాలు వినిపించాయి. వీరిలో సీనియర్ మంత్రులతో పాటు 2016లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసవచ్చినవారున్నారు. దీంతో పలువురు బీజేపీ పాతకాపులను, మాజీ సీఎంలను పుష్కర్ స్వయంగా వెళ్లి కలిశారు. అనంతరం పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని పుష్కర్ ప్రకటించారు. -
ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్‌సింగ్ ధామి ప్రమాణస్వీకారం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సత్పాల్ మహరాజ్, హరాక్సింగ్ రావత్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధామీతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో బిషన్‌సింగ్ చుపాల్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, గణేష్ జోషి, ధన్సింగ్ రావత్, రేఖా ఆర్య, యతీశ్వర్ ఆనంద్ ఉన్నారు. నూతన సీఎం పుష్కర్‌సింగ్ ధామీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలలలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండగా తీరత్ సింగ్ రావత్‌కు కాలం కలిసిరాలేదు. ఓవైపు కరోనా.. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపించడంతో ఆయనకు పదవీ గండం తప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితుల్లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. పార్టీ అంతర్గత కారణాలు కూడా బీజేపీ అధిష్టానం ఆయనను తప్పించడానికి దోహదం చేశాయని తెలుస్తోంది. -
వెంటాడిన దురదృష్టం: వీళ్లకు సీఎం పదవి మూణ్ణాళ్ల ముచ్చటే!
వెబ్‌డెస్క్: కాలం కలిసొచ్చినా.. దురదృష్టం వెక్కిరించింది అన్నట్లు... కథ అడ్డం తిరిగి ఎంపీ తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పార్టీలో చెలరేగిన సంక్షోభం కారణంగా సీఎంగా అవకాశం పొందిన ఆయన.. కడదాకా పదవిని నిలబెట్టుకోలేకపోయారు. ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు మహిళల వస్త్రధారణ, ఉచిత రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి అనడం వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానాన్ని ఇబ్బందులుకు గురిచేసి చేజేతులా పీఠాన్ని చేజార్చుకున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండటం... ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి కారణంగానే ఆయనను కుర్చీ నుంచి దింపుతున్నారనుకున్నా.. పెద్దలు తలచుకుంటే ఆయనతో రాజీనామా చేయించి.. మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టవచ్చు. కానీ అలా జరగలేదు. ఏదేమైనా 115 రోజుల పాటు సీఎంగా ఉన్న వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు తీరత్ సింగ్. ఈ నేపథ్యంలో అతితక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజకీయ నాయకుల గురించి కొన్ని వివరాలు... దేవేంద్ర ఫడ్నవిస్- మహారాష్ట్ర బీజేపీ- శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజులకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించిన ఆయన.. శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మహా కూటమిగా ఏర్పడటంతో రెండోసారి పూర్తిస్థాయి సీఎంగా పనిచేయాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి అచ్చంగా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. బీఎస్ యడియూరప్ప- కర్ణాటక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2018, మేలో బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే, అప్పటికే జేడీఎస్- కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడటం, విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో విశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు. మే 17న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 19న సీఎంగా వైదొలిగారు. జగదాంబికా పాల్- ఉత్తరప్రదేశ్ 1998లో ఫిబ్రవరి 21-23 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు జగదాంబికా పాల్. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దు కాగానే.. రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కళ్యాణ్‌సింగ్ తిరిగి సీఎంగా నియమితులు కాగానే జగదాంబికా పాల్ తన పదవికి రాజీనామా చేశారు. హరీశ్ రావత్- ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క రోజు సీఎం(రెండో దఫా)గా ఉన్నారు హరీశ్ రావత్. భారత రాజకీయ చరిత్రలో ఇలా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే. ఓం ప్రకాశ్ చౌతాలా- హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. నితీశ్ కుమార్- బిహార్ జనతా దళ్ నేత నితీశ్ కుమార్ 2000 సంవత్సరంలో మార్చి 3 నుంచి మార్చి 10 వరకు కేవలం 8 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. -
ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పుష్కర్‌సింగ్ ధామి గవర్నర్ బేబీరాణి మౌర్యను కలిశారు. శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్ మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ధామిని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో నూతన సీఎం ఎంపిక అనివార్యమైంది. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం... ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే, సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి తలెత్తింది. రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇక నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పుష్కర్‌సింగ్ ధామి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. పోటీలో మరో ఇద్దరు.. పుష్కర్‌కే ఓటు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర ఇంఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు తీరత్ సింగ్ రావత్, రాష్ట్ర బిజెపి నాయకులతో కేంద్ర మంత్రి తోమర్ చర్చలు జరిపారు. సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ పుష్కర్ సింగ్ ధామికే వైపునకే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన పుష్కర్‌సింగ్ ధామి గవర్నర్ బేబీరాణి మౌర్యను కలిసారు.పుష్కర్‌సింగ్ ధామి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిపొందారు. -
ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రాజీనామా!
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్గా సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం... ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే, సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తాజాగా ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇక గత మూడు రోజులుగా తీరత్ సింగ్ బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బుధవారం రాత్రి భేటీ అయిన ఆయన.. శుక్రవారం మరోసారి నడ్డాను కలిశారు. ఈ నేపథ్యంలో.. ప్రజాప్రతినిధుల చట్టం-1951 ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి లేనందున.. రాజీనామా చేయాలని నడ్డా ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా... హల్ద్వానీ, గంగోత్రి శాసన సభ స్థానాలు ఖాళీగానే ఉన్నప్పటికీ, ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే దాఖలాలు కనిపించడం లేనందున ఇదే సరైన నిర్ణయమని చెప్పినట్లు సమాచారం. దీంతో తీరత్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో మరో కీలక నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా తీరత్ సింగ్ ప్రస్తుతం పౌరీ గర్వాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
ప్రధాని మోదీతో భేటీకి సిద్ధం.. ఈలోపే కరోనా!
న్యూఢిల్లీ: ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తీరత్‌సింగ్ రావత్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. మోదీని కలిసే ముందే తీరత్‌సింగ్ రావత్‌కు తాను కరోనా బారిన పడిన విషయం తెలియడంతో కలకలం రేపింది. అతడికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా తెలిసి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా మహమ్మారి సోకి ఉండే అవకాశం ఉండేది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించుకుని నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనకు తీరత్ సింగ్ సిద్ధమయ్యారు. వాస్తవంగా సోమవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే ఆలోపే ఆయన కరోనా బారిన విషయం తెలియడంతో ఉన్నపళంగా ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ‘పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కానీ నేను ఆరోగ్యంగా ఉన్నా. వైద్యుల సలహాతో స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలి. జాగ్రత్తలు తీసుకోండి. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా’ అని తీరత్‌సింగ్ ట్విటర్లో తెలిపారు. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నారు. ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
ఇద్దర్నే ఎందుకు కన్నారు మరి: మరో వివాదంలో సీఎం
సాక్షి, డెహ్రాడూన్: ఇటీవల సీఎం పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ నేత, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. 'రిప్డ్ జీన్స్' అంటూ మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న తీరత్ సింగ్, అమెరికా, మన దేశాన్ని 200 ఏళ్లు పాలించిందంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. వీటిన్నింటికి మించి తాజాగా మరో వివాదానికి తెరతీశారు. కోవిడ్ మహమ్మారి మధ్య తమను తాము పోషించుకోవడానికి కష్టపడుతున్న పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు పంపిణీ చేసే కేంద్ర ప్రభుత్వ పథకం నుండి ఎక్కువ లబ్ది పొందాలంటే 20 మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాదు ఇద్దరు పిల్లలున్న మీరెందుకు అసూయపడతారు.. ఇరవైమందిని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. అటవీ దినోత్సవం సందర్బంగా రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంతో ఉత్తరాఖండ్ సీఎం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (ఉత్తరాఖండ్ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు..!) కరోనా వైరస్, లాక్డౌన్ వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా నాణ్యమైన రేషన్ సరుకులను పేదవారికి కేంద్రం అందిస్తోంది మనిషికి ఐదు కేజీల చొప్పున సరుకులు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో, నలుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీల సరుకులు దక్కుతుండగా, 20 మంది సభ్యులున్న కుటుంబానికి ఏకంగా క్వింటా సరుకులు లభిస్తున్నాయన్నారు. దీంతో ఎక్కువ సరుకులు పొందుతోన్న వారిపై చిన్నకుటుంబాల వాళ్లు అసూయతో రగిలిపోతున్నారంటూ విచక్షణా రహిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మీకు అసూయ..ఇద్దరు పిల్లల్నే కని ఆపేయడం ఎందుకు, 20 మంది పిల్లల్ని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. నేడు హస్తినకు తీరత్ మరోవైపు తీరత్ సింగ్ రావత్ ఈ రోజు (సోమవారం) ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన నాలుగు రోజులు ఇక్కడే ఉండి ప్రధాని మోదీని హోంమంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులను కలువనున్నారు. #WATCH हर घर में पर यूनिट 5 किलो राशन दिया गया।10 थे तो 50 किलो, 20 थे तो क्विंटल राशन दिया। फिर भी जलन होने लगी कि 2 वालों को 10 किलो और 20 वालों को क्विंटल मिला। इसमें जलन कैसी? जब समय था तो आपने 2 ही पैदा किए 20 क्यों नहीं पैदा किए: उत्तराखंड CM मुख्यमंत्री तीरथ सिंह रावत pic.twitter.com/cjh2hH5VKh — ANI_HindiNews (@AHindinews) March 21, 2021 -
ఉత్తరాఖండ్ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు..!
డెహ్రాడూన్: మహిళల టోర్న్ జీన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను 200 ఏండ్లు అమెరికా పాలించిందని, భారతీయులను బానిసలుగా చేసిందని, కానీ ఇప్పుడు అమెరికా కరోనా వైరస్ ని అదుపు చేయలేక సతమతమవుతోందని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తెలిపారు. రవి అస్తమించని రాజ్యంగానూ పేరుపొందిన అమెరికా ఇవాళ కొవిడ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిందంటూ వ్యాఖ్యానించడం వివాదాన్ని రేపింది. స్వయంగా ముఖ్యమంత్రికి బ్రిటన్‌కు అమెరికాకు తేడా తెలియకుండా మాట్లాడటం ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా అమెరికా విఫలమైతే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్తంలోని ఇండియా మాత్రం మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేయగలిగిందంటూ ఉత్తరాఖండ్ సీఎం మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని చాలా దేశాలను పాలించిన అమెరికా ప్రస్తుతం కరోనాను అదుపు చేయడంలో తలలు పట్టుకుంటోందని విమర్శించారు. భారత్‌తో పోల్చితే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 50 లక్షల వరకు చేరిందని చెప్పారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని అమెరికా ప్రభుత్వం మరొకసారి లాక్డౌన్ విధించే యోచన చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో నరేంద్ర మోదీ తప్ప ఈ దేశానికి మరెవరైనా ప్రధాని అయి ఉంటే, భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ తీసుకున్న చర్యలతో భారత ప్రజలు క్షేమంగా ఉన్నారన్నారు. కానీ ‘కొంతమంది ప్రధాని ఆదేశాలను మనం పాటించడంలేదని వ్యాఖ్యానించారు. మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలను కొందరు మాత్రమే పాటిస్తున్నారు’ అని తీరాత్ సింగ్ రావత్ అన్నారు. టోర్న్ జీన్స్ వస్త్రధారణపై తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సినీ ప్రపంచం, రాజకీయ నేతలు, విద్యార్థినులు, మహిళలు తప్పుబట్టారు. అంతేకాదు,సోషల్‌మీడియాలో నెటిజన్లను ఆయనను తీవ్యంగా దుయ్యబట్టారు. దీంతో దిగొచ్చిన ఆయన క్షమాపణ తెలిపారు. కానీ మహిళలు జీన్స్ ధరించడం అభ్యంతరం లేదంటూనే చిరిగిన వాటిని ధరించడం సరైంది కాదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. #WATCH "...As opposed to other countries, India is doing better in terms of handling #COVID19 crisis. America, who enslaved us for 200 years and ruled the world, is struggling in current times," says Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/gHa9n33W2O — ANI (@ANI) March 21, 2021 (చదవండి: మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్‌ను సందర్శించారా?) -
రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు
‘మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ (రిప్డ్ జీన్స్) ధరించిన ఆడవాళ్లు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’... ఇది ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ కామెంట్. వెంటనే స్త్రీలు ప్రతిస్పందించారు. ‘హాష్స్టాగ్రిప్డ్జీన్స్’ మూవ్‌మెంట్‌ను ట్విటర్లో వరదలా వెల్లువెత్తించారు. అందరూ తమ రిప్డ్ జీన్స్‌తో ట్విటర్లో ఫొటోలు పెట్టి ‘ఏమంటారు సి.ఎం గారూ’ అని అడగడమే. మగవాళ్లు ఎందుచేత తమకు స్త్రీల బట్టల మీద వ్యాఖ్యానించే ఆధిపత్యం ఉందని అనుకుంటారో అని వీరు ప్రశ్నిస్తున్నారు. కంగనా రనౌత్ ఇదే సమయంలో ఒక కామెంట్ చేసింది. కుర్రకారును ఇంకో రకంగా హెచ్చరించింది. ఈ మొత్తం ట్రెండ్‌పై కథనం. మంగళవారం (మార్చి 16) డెహ్రాడూన్‌లో బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సి.ఎం. పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల గురించిన కార్యక్రమం కాబట్టి బాలల విషయంలో తల్లిదండ్రులకు హితవు చెప్పాలనుకున్నారు. అయితే ఆ హితవు స్త్రీల దుస్తులకు సంబంధించిందిగా మారి వ్యతిరేకత ఎదురైంది. ‘నేనొకసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న మహిళ ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తోంది. ఆమె తన మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ ధరించింది. ఆమె తన పిల్లలకు ఈ ‘కత్తిరింపుల సంస్కృతి’ ద్వారా ఏం చెప్పదలుచుకుంది. ఇటువంటి వారు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’ అన్నారు. ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ ‘పాశ్చాత్యులు మనల్ని చూసి యోగా చేస్తున్నారు. ఒంటి నిండా బట్టకప్పుకుంటున్నారు. మనం నగ్నత్వం వైపు వెళుతున్నాం’ అని కూడా ఆయన అన్నారు. వెంటనే అక్కడి ప్రతిపక్షం వారు దీనిని ఖండించారు. ‘మహిళలను అవమానించే ఈ వ్యాఖ్య చేసినందుకు సి.ఎం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు స్త్రీల దుస్తులపై గతంలో వచ్చిన పురుషాధిపత్య వ్యాఖ్యల వంటివే ఇవి కూడా అని వెంటనే స్త్రీల వైపు నుంచి వ్యతిరేక స్పందన మొదలైపోయింది. క్షణాల్లో ‘హ్యాష్స్టాగ్రిప్డ్జీన్స్ట్విటర్’ అంటూ ట్విటర్లో సెలబ్రిటీలు, సాధారణ స్త్రీలు రిప్డ్ జీన్స్‌లో ఉన్న తమ ఫొటోలను పోస్ట్ చేశారు. వీరిలో యువత ఉంది. తల్లులూ ఉన్నారు. ‘దేశంలో రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు. స్త్రీ ద్వేష వ్యాఖ్యలు చేసే పురుషుల వల్ల’ అని వారు వ్యాఖ్యలు రాశారు. ‘సోచ్ బద్లో దేశ్ బద్లేగా’ (ఆలోచనాధోరణి మారిస్తే దేశం మారుతుంది) అని కూడా వారు రాశారు. ‘బిజెపి ఇంకో 50 ఏళ్లు పరిపాలించవచ్చు. కాని రిప్డ్ జీన్స్ ఎప్పటికీ ఉంటాయి’ అని ఒకరు రాశారు. ఒకామె ‘జీన్స్ సంగతి వదిలిపెట్టండి. నేను రిప్డ్ స్కర్ట్ వేసుకుంటాను’ అని పెట్టింది. ఇంకా ఎన్నో వ్యాఖ్యలు. పదవిలోకి వచ్చిన పదిరోజుల్లోనే సి.ఎం తిరత్‌సింగ్ ఈ వివాదంలో పడ్డారు. రిప్డ్ జీన్స్‌తో ఫొటోలు పెట్టినవారిలో అమితాబ్ మనవరాలు నవేలి నందా కూడా ఉంది. అయితే ఆ తర్వాత ఆమె ఆ పోస్ట్ తొలగించింది. ఆమె అమ్మమ్మ జయభాదురి ‘ఇలాంటి వ్యాఖ్యలు ఒక సి.ఎంకు తగవు. అధికారంలో ఉన్నవారు ఇలా మాట్లాడటం వల్ల స్త్రీల మీద నేరాలకు ఊతం దొరుకుతుంది’ అని విమర్శించారు. ఎందుకు ఈ ట్రెండ్ రిప్డ్ జీన్స్ 1870లలోనే తయారైనా 1970లలో ఇవి ఫ్యాషన్ అయ్యాయి. వ్యవస్థ మీద కోపం, నిదర్శన ప్రదర్శించడానికి నాటి కుర్రకారు తమ జీన్స్ ప్యాంట్లను చించి తొడుక్కునేవారు. గాయని మడోనా ఈ ధోరణిని విస్తృతం చేసింది. ఆమె అభిమానులు ఆ ఫ్యాషన్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత జీన్స్ కంపెనీలు చిరిగిన జీన్స్‌ను తయారు చేసి మార్కెట్ చేయడం మొదలెట్టాయి. భారతదేశంలో కొత్తల్లో ఇవి అవహేళనకు గురైనా ‘ఎయిర్పోర్ట్ ఫ్యాషన్’గా గుర్తింపు పొందాయి. ప్రయాణాలు చేసే వారు వీటిని ధరించేవారు. ఇవాళ ఈ జీన్స్ ఇతర అన్ని జీన్స్ వలే సర్వసాధారణం. కంగనా ప్రమేయం ఒకవైపు హ్యాష్స్టాగ్ రిప్డ్జీన్స్ ట్రెండ్ నడుస్తుంటే మరోవైపు ఇవే జీన్స్ గురించి నటి కంగనా రనౌత్ వాటితో ఉన్న తన ఫొటోలు ట్విటర్లో పెట్టి కామెంట్ రాసింది. ‘రిప్డ్ జీన్స్ వేసుకున్నా మీరు అవి మీ కూల్‌నెస్‌ను స్టయిల్‌ను తెలిపేలా ఉన్నవే వేసుకోండి. అంతేతప్ప (అమ్మాయిలైనా అబ్బాయిలైనా) దిక్కులేని బిచ్చగాళ్ల వలే కనిపించే రిప్డ్జీన్స్ వేసుకోకండి’ అని చెప్పింది. ఈ కామెంట్స్‌కు ప్రతిస్పందన ఇంకా మొదలు కాలేదు.దేశ సంస్కృతి సభ్యత స్త్రీల బట్టల్లోనే ఉంది అని పురుషులు మాట్లాడుతున్న ప్రతిసారీ స్త్రీల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను చూసైనా పురుషులు తమ వ్యాఖ్యల్లోని అసంబద్ధతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల కోసం ఎదురు చూడక తప్పదు. -
జీన్స్ వద్దన్న సీఎం! బరాబర్ వేస్తానంటున్న బిగ్‌బీ మనవరాలు
అమ్మాయిల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! చిరిగిపోయిన జీన్స్ వేసుకుని ఎక్స్పోజింగ్ చేయడం, వాటిని ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం దురదృష్టకరమని, ఇది సంస్కృతిని దెబ్బ తీయడమేనని పేర్కొన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా పోటీపడి మరి స్కిన్ షో చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా మీరు చెప్పాలా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ సైతం సీఎం వ్యాఖ్యలపై ఒంటికాలిన దిగ్గున లేచింది. "మా వస్త్రధారణ మార్చే ముందు మీరు మీ ఆలోచనలను మార్చుకోండి. ఎందుకంటే మీరు సమాజానికి ఇస్తున్న సందేశాలు మమ్మల్ని మరింత షాక్‌కు గురి చేస్తున్నాయి" అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. అంతే కాదు తను జీన్స్ ధరించిన ఫొటోను షేర్ చేస్తూ "నేను సగర్వంగా ఈ జీన్స్‌ను ధరిస్తాను" అని చెప్పుకొచ్చింది. చదవండి: చిరిగిన జీన్స్ ధరించడంపై ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు -
మోకాళ్లు కనిపించేలా జీన్స్‌లా.. సమాజానికి ఏం సందేశమిద్దామని
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అమ్మాయిల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాల వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు చిరిగిపోయిన జీన్స్ ధరించడం సామాజిక విచ్ఛిన్నానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వస్త్రధారణతో భవిష్యత్తు తరాలకు ఏం సందేశమిస్తారని ఆయన నిలదీశారు. ఈ రకమైన వస్త్రధారణ మాదకద్రవ్యాల వినియోగానికి దారితీస్తుందని పేర్కొన్నారు. చిరిగిన డెనిమ్ జీన్స్‌లు ధరిస్తూ ఎక్స్పోజింగ్ చేయడం, అవి ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం నేటి తరాలు సంస్కృతిలా భావించడం దురదృష్టకరమని, ఇది కేవలం కత్తెర సంస్కృతి (కైంచి సే సాన్స్కార్) మాత్రమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేటితరం తలిదండ్రులు ఇలాంటి వస్త్రధారణకు అలవాటుపడితే.. తమ పిల్ల్లలకు ఇళ్లలో ఏం నేర్పుతారని ప్రశ్నించారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లు పోటీపడి మరీ స్కిన్ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాశ్చాత్యీకరణ పేరుతో మనం చిరిగిన పేలికలను వేసుకుంటుంటే.. పాశ్చాత్య ప్రపంచం మాత్రం మనల్ని అనుసరిస్తూ యోగాభ్యాసం చేస్తుందని అన్నారు. వారు తమ శరీరాలను పూర్తిగా కప్పుకొని యోగాభ్యాసం చేయడం చూస్తుంటే మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఓ మహిళ గురించి ప్రస్తావిస్తూ.. చిరిగిన జీన్స్ ధరించి ఆమె సేవ చేస్తూ సమాజానికి ఏం సందేశమిస్తుందని విమర్శించారు. -
మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..
హరిద్వార్: భారతీయులు రాముడిని ఎలా కొలుస్తారో, ప్రధాని మోదీ చేసే మంచి పనులకు రాబోయే రోజుల్లో ఆయనను కూడా అలాగే ఆరాధిస్తారంటూ ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన నేత్ర కుంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు సమాజం కోసం పని చేశారు. అందుకే రాముడిని ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. అలాగే ప్రధాని మోదీ కూడా సమాజం కోసం పని చేస్తున్నారు, కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనను కూడా రాముడి అవతారంలా భావించి కొలుస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎంగా ఎన్నికయ్యాక పాల్గొన్న తొలి కార్యక్రమంలో తీరత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH | Lord Ram worked for the same society & people started to believe that He was a God. In the coming time, Narendra Modi will also be seen at par with Him (Lord Ram): Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/xjw04hSsai — ANI (@ANI) March 15, 2021 కాగా, ప్రధాని మోదీ రాముడంతటి గొప్పవాడంటూ గతంలో బీజేపీ నేతలు చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బహిరంగ సభలో మోదీని రాముడితో పోల్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం ఆయన ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
కొత్త సీఎంపై వీడిన ఉత్కంఠ
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారనే అనేక అంచనాల మధ్య ఈ ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం రాజీనామా చేయడంతో బుధవారం నాటి బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంత్రం తీరత్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తీరత్ సింగ్ రావత్ మాట్లాడుతూ తాను చిన్న గ్రామం నుండి వచ్చిన పార్టీ కార్యకర్తగా తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదంటూ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకాన్ని ఉంచిన ప్రధాని, హోం మంత్రి పార్టీ చీఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామనీ, గత నాలుగేళ్లుగా చేపట్టిన కృషిని ముందుకు తీసుకెళతామంటూ హామీ ఇచ్చారు. అయితే సీఎం రేసులో బీజేపీ ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్, బీజేపీ సీనియర్ నేత ఎంపీ అజయ్‌భట్, అనిల్ బలూని పేర్లు కూడా బాగా వినిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కుమాన్ ప్రాంతం నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. (ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా)