
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అమ్మాయిల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాల వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు చిరిగిపోయిన జీన్స్ ధరించడం సామాజిక విచ్ఛిన్నానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వస్త్రధారణతో భవిష్యత్తు తరాలకు ఏం సందేశమిస్తారని ఆయన నిలదీశారు. ఈ రకమైన వస్త్రధారణ మాదకద్రవ్యాల వినియోగానికి దారితీస్తుందని పేర్కొన్నారు. చిరిగిన డెనిమ్ జీన్స్‌లు ధరిస్తూ ఎక్స్‌పోజింగ్ చేయడం, అవి ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం నేటి తరాలు సంస్కృతిలా భావించడం దురదృష్టకరమని, ఇది కేవలం కత్తెర సంస్కృతి (కైంచి సే సాన్స్కార్) మాత్రమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నేటితరం తలిదండ్రులు ఇలాంటి వస్త్రధారణకు అలవాటుపడితే.. తమ పిల్ల్లలకు ఇళ్లలో ఏం నేర్పుతారని ప్రశ్నించారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లు పోటీపడి మరీ స్కిన్ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాశ్చాత్యీకరణ పేరుతో మనం చిరిగిన పేలికలను వేసుకుంటుంటే.. పాశ్చాత్య ప్రపంచం మాత్రం మనల్ని అనుసరిస్తూ యోగాభ్యాసం చేస్తుందని అన్నారు. వారు తమ శరీరాలను పూర్తిగా కప్పుకొని యోగాభ్యాసం చేయడం చూస్తుంటే మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఓ మహిళ గురించి ప్రస్తావిస్తూ.. చిరిగిన జీన్స్ ధరించి ఆమె సేవ చేస్తూ సమాజానికి ఏం సందేశమిస్తుందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment