ripped jeans
-
రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు
‘మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ (రిప్డ్ జీన్స్) ధరించిన ఆడవాళ్లు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’... ఇది ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ కామెంట్. వెంటనే స్త్రీలు ప్రతిస్పందించారు. ‘హాష్స్టాగ్రిప్డ్జీన్స్’ మూవ్‌మెంట్‌ను ట్విటర్లో వరదలా వెల్లువెత్తించారు. అందరూ తమ రిప్డ్ జీన్స్‌తో ట్విటర్లో ఫొటోలు పెట్టి ‘ఏమంటారు సి.ఎం గారూ’ అని అడగడమే. మగవాళ్లు ఎందుచేత తమకు స్త్రీల బట్టల మీద వ్యాఖ్యానించే ఆధిపత్యం ఉందని అనుకుంటారో అని వీరు ప్రశ్నిస్తున్నారు. కంగనా రనౌత్ ఇదే సమయంలో ఒక కామెంట్ చేసింది. కుర్రకారును ఇంకో రకంగా హెచ్చరించింది. ఈ మొత్తం ట్రెండ్‌పై కథనం. మంగళవారం (మార్చి 16) డెహ్రాడూన్‌లో బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సి.ఎం. పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల గురించిన కార్యక్రమం కాబట్టి బాలల విషయంలో తల్లిదండ్రులకు హితవు చెప్పాలనుకున్నారు. అయితే ఆ హితవు స్త్రీల దుస్తులకు సంబంధించిందిగా మారి వ్యతిరేకత ఎదురైంది. ‘నేనొకసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న మహిళ ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తోంది. ఆమె తన మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ ధరించింది. ఆమె తన పిల్లలకు ఈ ‘కత్తిరింపుల సంస్కృతి’ ద్వారా ఏం చెప్పదలుచుకుంది. ఇటువంటి వారు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’ అన్నారు. ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ ‘పాశ్చాత్యులు మనల్ని చూసి యోగా చేస్తున్నారు. ఒంటి నిండా బట్టకప్పుకుంటున్నారు. మనం నగ్నత్వం వైపు వెళుతున్నాం’ అని కూడా ఆయన అన్నారు. వెంటనే అక్కడి ప్రతిపక్షం వారు దీనిని ఖండించారు. ‘మహిళలను అవమానించే ఈ వ్యాఖ్య చేసినందుకు సి.ఎం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు స్త్రీల దుస్తులపై గతంలో వచ్చిన పురుషాధిపత్య వ్యాఖ్యల వంటివే ఇవి కూడా అని వెంటనే స్త్రీల వైపు నుంచి వ్యతిరేక స్పందన మొదలైపోయింది. క్షణాల్లో ‘హ్యాష్స్టాగ్రిప్డ్జీన్స్ట్విటర్’ అంటూ ట్విటర్లో సెలబ్రిటీలు, సాధారణ స్త్రీలు రిప్డ్ జీన్స్‌లో ఉన్న తమ ఫొటోలను పోస్ట్ చేశారు. వీరిలో యువత ఉంది. తల్లులూ ఉన్నారు. ‘దేశంలో రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు. స్త్రీ ద్వేష వ్యాఖ్యలు చేసే పురుషుల వల్ల’ అని వారు వ్యాఖ్యలు రాశారు. ‘సోచ్ బద్లో దేశ్ బద్లేగా’ (ఆలోచనాధోరణి మారిస్తే దేశం మారుతుంది) అని కూడా వారు రాశారు. ‘బిజెపి ఇంకో 50 ఏళ్లు పరిపాలించవచ్చు. కాని రిప్డ్ జీన్స్ ఎప్పటికీ ఉంటాయి’ అని ఒకరు రాశారు. ఒకామె ‘జీన్స్ సంగతి వదిలిపెట్టండి. నేను రిప్డ్ స్కర్ట్ వేసుకుంటాను’ అని పెట్టింది. ఇంకా ఎన్నో వ్యాఖ్యలు. పదవిలోకి వచ్చిన పదిరోజుల్లోనే సి.ఎం తిరత్‌సింగ్ ఈ వివాదంలో పడ్డారు. రిప్డ్ జీన్స్‌తో ఫొటోలు పెట్టినవారిలో అమితాబ్ మనవరాలు నవేలి నందా కూడా ఉంది. అయితే ఆ తర్వాత ఆమె ఆ పోస్ట్ తొలగించింది. ఆమె అమ్మమ్మ జయభాదురి ‘ఇలాంటి వ్యాఖ్యలు ఒక సి.ఎంకు తగవు. అధికారంలో ఉన్నవారు ఇలా మాట్లాడటం వల్ల స్త్రీల మీద నేరాలకు ఊతం దొరుకుతుంది’ అని విమర్శించారు. ఎందుకు ఈ ట్రెండ్ రిప్డ్ జీన్స్ 1870లలోనే తయారైనా 1970లలో ఇవి ఫ్యాషన్ అయ్యాయి. వ్యవస్థ మీద కోపం, నిదర్శన ప్రదర్శించడానికి నాటి కుర్రకారు తమ జీన్స్ ప్యాంట్లను చించి తొడుక్కునేవారు. గాయని మడోనా ఈ ధోరణిని విస్తృతం చేసింది. ఆమె అభిమానులు ఆ ఫ్యాషన్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత జీన్స్ కంపెనీలు చిరిగిన జీన్స్‌ను తయారు చేసి మార్కెట్ చేయడం మొదలెట్టాయి. భారతదేశంలో కొత్తల్లో ఇవి అవహేళనకు గురైనా ‘ఎయిర్పోర్ట్ ఫ్యాషన్’గా గుర్తింపు పొందాయి. ప్రయాణాలు చేసే వారు వీటిని ధరించేవారు. ఇవాళ ఈ జీన్స్ ఇతర అన్ని జీన్స్ వలే సర్వసాధారణం. కంగనా ప్రమేయం ఒకవైపు హ్యాష్స్టాగ్ రిప్డ్జీన్స్ ట్రెండ్ నడుస్తుంటే మరోవైపు ఇవే జీన్స్ గురించి నటి కంగనా రనౌత్ వాటితో ఉన్న తన ఫొటోలు ట్విటర్లో పెట్టి కామెంట్ రాసింది. ‘రిప్డ్ జీన్స్ వేసుకున్నా మీరు అవి మీ కూల్‌నెస్‌ను స్టయిల్‌ను తెలిపేలా ఉన్నవే వేసుకోండి. అంతేతప్ప (అమ్మాయిలైనా అబ్బాయిలైనా) దిక్కులేని బిచ్చగాళ్ల వలే కనిపించే రిప్డ్జీన్స్ వేసుకోకండి’ అని చెప్పింది. ఈ కామెంట్స్‌కు ప్రతిస్పందన ఇంకా మొదలు కాలేదు.దేశ సంస్కృతి సభ్యత స్త్రీల బట్టల్లోనే ఉంది అని పురుషులు మాట్లాడుతున్న ప్రతిసారీ స్త్రీల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను చూసైనా పురుషులు తమ వ్యాఖ్యల్లోని అసంబద్ధతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల కోసం ఎదురు చూడక తప్పదు. -
మోకాళ్లు కనిపించేలా జీన్స్‌లా.. సమాజానికి ఏం సందేశమిద్దామని
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అమ్మాయిల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాల వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు చిరిగిపోయిన జీన్స్ ధరించడం సామాజిక విచ్ఛిన్నానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వస్త్రధారణతో భవిష్యత్తు తరాలకు ఏం సందేశమిస్తారని ఆయన నిలదీశారు. ఈ రకమైన వస్త్రధారణ మాదకద్రవ్యాల వినియోగానికి దారితీస్తుందని పేర్కొన్నారు. చిరిగిన డెనిమ్ జీన్స్‌లు ధరిస్తూ ఎక్స్పోజింగ్ చేయడం, అవి ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం నేటి తరాలు సంస్కృతిలా భావించడం దురదృష్టకరమని, ఇది కేవలం కత్తెర సంస్కృతి (కైంచి సే సాన్స్కార్) మాత్రమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేటితరం తలిదండ్రులు ఇలాంటి వస్త్రధారణకు అలవాటుపడితే.. తమ పిల్ల్లలకు ఇళ్లలో ఏం నేర్పుతారని ప్రశ్నించారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లు పోటీపడి మరీ స్కిన్ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాశ్చాత్యీకరణ పేరుతో మనం చిరిగిన పేలికలను వేసుకుంటుంటే.. పాశ్చాత్య ప్రపంచం మాత్రం మనల్ని అనుసరిస్తూ యోగాభ్యాసం చేస్తుందని అన్నారు. వారు తమ శరీరాలను పూర్తిగా కప్పుకొని యోగాభ్యాసం చేయడం చూస్తుంటే మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఓ మహిళ గురించి ప్రస్తావిస్తూ.. చిరిగిన జీన్స్ ధరించి ఆమె సేవ చేస్తూ సమాజానికి ఏం సందేశమిస్తుందని విమర్శించారు. -
చిరాకేస్తే చింపెయ్.. కొత్తది రెడీ..!!
సాక్షి, ముంబై: కొత్తక వింత...పాతొక రోత అన్నట్లు పాశ్చాత్య సంస్కృతి విస్తరించడంతో మార్కెట్లో వచ్చే కొత్త ఫ్యాషన్లపై యువతలో మోజు పెరుగుతోంది. జుట్టు చెదిరిపోయి, చినిగిన దుస్తులను ధరించడం ఇప్పుడో వింత ఫ్యాషన్. చిరిగిన జీన్స్ ఇపుడు విభిన్న శ్రేణుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యువతలో క్రేజ్ పెరగడంతో ఫ్యాషన్ డిజైనర్లు వీటిని వెరైటీగా రూపొందిస్తున్నారు. నచ్చిన మోడల్ ఏదైనా ఎంత డబ్బు పోసి కొనేందుకైనా యువత సిద్ధమైపోతున్నారు. అలా కొనుకున్న జీన్స్‌లో ఏదైనా అసౌకర్యం అనిపిస్తే బాధపడాల్సిన పనిలేదు. వాటికి పెద్ద బొక్కలు పెడితే చాలు. కంఫర్ట్‌గా మారుతుంది. అదేంటి అనుకుంటున్నారా? ట్రెండ్ మారింది. ఇప్పుడిక టోర్న్ జీన్స్ కథ ముగిసి రిప్డ్ జీన్స్ ట్రెండ్ మొదలవుతోంది. జీన్స్ ప్యాంట్‌కు తొడ, మోకాళ్లపై పెద్ద బొక్కలు పెట్టుకుంటే చాలు రిప్డ్ జీన్స్ రెడీ..! అటు కంఫర్ట్‌గా ఉంటుంది. ఇటు ట్రెండీగాను ఉంటుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. సమ్మర్ స్పెషల్‌గా పేర్కొంటున్న ఈ జీన్స్‌ను ముంబై నగరంలో బాలీవుడ్ హీరోయిన్లు అమీషా పటేల్, ట్వింకిల్ ఖన్నాలు ధరించి చూపరులను ఆకర్శించారు. ఎప్పుడూ మమూలు ట్రెండీ దుస్తుల్లో కనిపించే ట్వింకిల్ ఖన్నా పూర్తి భిన్నంగా మారిపోయారు. పులి బొమ్మతో కూడిన టీషర్ట్‌ని ధరించి, తొడలు, మోకాళ్ల వద్ద పెద్దపెద్ద బొక్కలు గల రిప్డ్ జీన్స్ ప్యాంట్‌తో ట్రెండ్ సెట్ చేస్తా అనేలా జుహు ప్రాంతంలో దర్శనమిచ్చారు. తరచూ డిజైనర్ దుస్తుల్లో కనిపించే అమీషా పటేల్ కూడా ఇదే తరహా బొక్కల ప్యాంటుతో చూపరులకు కొత్త ఆలోచన కల్పించారు. అప్పటికే మనం వాడుతున్న జీన్స్‌ను పడేయాల్సిన పనిలేకుండా వాటికి గాట్లు, పెద్ద బొక్కలు పెడితే చాలు ట్రెండీ రిప్డ్ జీన్స్‌ను తయారు చేసుకోవచ్చనే ఐడియాను అందించారు. సమ్మర్లో కూడా జీన్స్‌ను వదులుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని అమీషా, ట్వింకిల్‌లు జీన్స్ ప్రియులకు తమ ట్రెండీ లుక్‌తో తెలియజెప్పారు. -
రాత్రి 7 గంటలు దాటితే అమ్మాయిలపై నిషేధం
ముంబై: ముంబైలోని కొన్ని కాలేజీలు విద్యార్థులు ధరించే దుస్తులపై ఆంక్షలు విధించాయి. ఫ్యాషన్ కోసం కత్తిరించుకున్న జీన్స్, స్లీవ్‌లెస్ క్లాత్స్, షార్ట్స్ వేసుకుని అమ్మాయిలు/అబ్బాయిలు కాలేజీ క్యాంపస్‌లోకి రాకూడదని నిబంధనలు పెట్టాయి. కాలేజీ ఎంట్రన్స్ వద్ద ఈ మేరకు నోటీసులు అతికించాయి. సెయింట్ జేవియర్ కాలేజీ, విల్సన్ కాలేజీ తదితర కాలేజీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా కాలేజీ యాజమాన్యాలు దుస్తులపై ఆంక్షలు విధించడంపై విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. కత్తిరింపులున్న జీన్స్ వేసుకుని సెయింట్ జేవియర్ కాలేజీకి వెళ్లిన ఓ స్టూడెంట్ను గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కొన్ని కాలేజీల్లో అమ్మాయిలకు సమయం నిబంధన కూడా విధించారు. రాత్రి ఏడు గంటల తర్వాత అమ్మాయిలు కాలేజీ క్యాంపస్‌లో ఉండరాదని ఆంక్షలు పెట్టారు. క్యాంపస్‌లోని లైబ్రరీ లేదా ల్యాబ్‌లలో ఎక్కడా అమ్మాయిలు ఉండరాదని సూచించారు. -
మళ్లీ వచ్చేశాయి!
ట్రెండ్ ఫ్యాషన్ అనేది ‘టాటా... వీడుకోలు’ అని ఎప్పుడూ పాడదు. ఎందుకంటే అది వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వస్తుంది. ‘బాగున్నారా!’ అని పలకరిస్తుంది. ‘రిప్పెడ్ జీన్స్’ హవా 1990 ప్రాంతంలో బాగా నడిచింది. ఇప్పుడు లేటెస్ట్గా ముందుకు వచ్చింది. ఈ జీన్స్ వేసుకోవడాన్ని ఇప్పుడు కుర్రకారు ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ప్యాంట్లో ఏ చిన్న చిరుగు కనిపించినా ‘ఇక సెలవా మరి!’ అని మూలకు పడేసేవాళ్లం. ‘రిప్పెడ్ జీన్స్’లో ఎన్నో చిరుగులు! ఎంత ఎక్కువ చిరుగులు కనిపిస్తే ఇప్పుడు అంత ఫ్యాషన్ అన్నమాట!