అమీషా పటేల్, ట్వింకిల్ ఖన్నా
సాక్షి, ముంబై: కొత్తక వింత...పాతొక రోత అన్నట్లు పాశ్చాత్య సంస్కృతి విస్తరించడంతో మార్కెట్‌లో వచ్చే కొత్త ఫ్యాషన్లపై యువతలో మోజు పెరుగుతోంది. జుట్టు చెదిరిపోయి, చినిగిన దుస్తులను ధరించడం ఇప్పుడో వింత ఫ్యాషన్. చిరిగిన జీన్స్ ఇపుడు విభిన్న శ్రేణుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యువతలో క్రేజ్ పెరగడంతో ఫ్యాషన్ డిజైనర్లు వీటిని వెరైటీగా రూపొందిస్తున్నారు. నచ్చిన మోడల్ ఏదైనా ఎంత డబ్బు పోసి కొనేందుకైనా యువత సిద్ధమైపోతున్నారు.
అలా కొనుకున్న జీన్స్‌లో ఏదైనా అసౌకర్యం అనిపిస్తే బాధపడాల్సిన పనిలేదు. వాటికి పెద్ద బొక్కలు పెడితే చాలు. కంఫర్ట్‌గా మారుతుంది. అదేంటి అనుకుంటున్నారా? ట్రెండ్ మారింది. ఇప్పుడిక టోర్న్ జీన్స్ కథ ముగిసి రిప్డ్ జీన్స్ ట్రెండ్ మొదలవుతోంది. జీన్స్ ప్యాంట్‌కు తొడ, మోకాళ్లపై పెద్ద బొక్కలు పెట్టుకుంటే చాలు రిప్డ్ జీన్స్ రెడీ..! అటు కంఫర్ట్‌గా ఉంటుంది. ఇటు ట్రెండీగాను ఉంటుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.
సమ్మర్ స్పెషల్‌గా పేర్కొంటున్న ఈ జీన్స్‌ను ముంబై నగరంలో బాలీవుడ్ హీరోయిన్లు అమీషా పటేల్, ట్వింకిల్ ఖన్నాలు ధరించి చూపరులను ఆకర్శించారు. ఎప్పుడూ మమూలు ట్రెండీ దుస్తుల్లో కనిపించే ట్వింకిల్ ఖన్నా పూర్తి భిన్నంగా మారిపోయారు. పులి బొమ్మతో కూడిన టీషర్ట్‌ని ధరించి, తొడలు, మోకాళ్ల వద్ద పెద్దపెద్ద బొక్కలు గల రిప్డ్ జీన్స్ ప్యాంట్‌తో ట్రెండ్ సెట్ చేస్తా అనేలా జుహు ప్రాంతంలో దర్శనమిచ్చారు.
తరచూ డిజైనర్ దుస్తుల్లో కనిపించే అమీషా పటేల్ కూడా ఇదే తరహా బొక్కల ప్యాంటుతో చూపరులకు కొత్త ఆలోచన కల్పించారు. అప్పటికే మనం వాడుతున్న జీన్స్‌ను పడేయాల్సిన పనిలేకుండా వాటికి గాట్లు, పెద్ద బొక్కలు పెడితే చాలు ట్రెండీ రిప్డ్ జీన్స్‌ను తయారు చేసుకోవచ్చనే ఐడియాను అందించారు. సమ్మర్‌లో కూడా జీన్స్‌ను వదులుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని అమీషా, ట్వింకిల్‌లు జీన్స్ ప్రియులకు తమ ట్రెండీ లుక్‌తో తెలియజెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment