‘మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ (రిప్డ్ జీన్స్) ధరించిన ఆడవాళ్లు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’... ఇది ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ కామెంట్. వెంటనే స్త్రీలు ప్రతిస్పందించారు. ‘హాష్‌స్టాగ్‌రిప్డ్‌జీన్స్’ మూవ్‌మెంట్‌ను ట్విటర్‌లో వరదలా వెల్లువెత్తించారు. అందరూ తమ రిప్డ్ జీన్స్‌తో ట్విటర్‌లో ఫొటోలు పెట్టి ‘ఏమంటారు సి.ఎం గారూ’ అని అడగడమే. మగవాళ్లు ఎందుచేత తమకు స్త్రీల బట్టల మీద వ్యాఖ్యానించే ఆధిపత్యం ఉందని అనుకుంటారో అని వీరు ప్రశ్నిస్తున్నారు. కంగనా రనౌత్ ఇదే సమయంలో ఒక కామెంట్ చేసింది. కుర్రకారును ఇంకో రకంగా హెచ్చరించింది. ఈ మొత్తం ట్రెండ్‌పై కథనం.
మంగళవారం (మార్చి 16) డెహ్రాడూన్‌లో బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సి.ఎం. పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల గురించిన కార్యక్రమం కాబట్టి బాలల విషయంలో తల్లిదండ్రులకు హితవు చెప్పాలనుకున్నారు. అయితే ఆ హితవు స్త్రీల దుస్తులకు సంబంధించిందిగా మారి వ్యతిరేకత ఎదురైంది. ‘నేనొకసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న మహిళ ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తోంది. ఆమె తన మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ ధరించింది. ఆమె తన పిల్లలకు ఈ ‘కత్తిరింపుల సంస్కృతి’ ద్వారా ఏం చెప్పదలుచుకుంది. ఇటువంటి వారు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’ అన్నారు.
ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్
‘పాశ్చాత్యులు మనల్ని చూసి యోగా చేస్తున్నారు. ఒంటి నిండా బట్టకప్పుకుంటున్నారు. మనం నగ్నత్వం వైపు వెళుతున్నాం’ అని కూడా ఆయన అన్నారు. వెంటనే అక్కడి ప్రతిపక్షం వారు దీనిని ఖండించారు. ‘మహిళలను అవమానించే ఈ వ్యాఖ్య చేసినందుకు సి.ఎం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
మరోవైపు స్త్రీల దుస్తులపై గతంలో వచ్చిన పురుషాధిపత్య వ్యాఖ్యల వంటివే ఇవి కూడా అని వెంటనే స్త్రీల వైపు నుంచి వ్యతిరేక స్పందన మొదలైపోయింది. క్షణాల్లో ‘హ్యాష్‌స్టాగ్‌రిప్డ్‌జీన్స్‌ట్విటర్’ అంటూ ట్విటర్లో సెలబ్రిటీలు, సాధారణ స్త్రీలు రిప్డ్ జీన్స్‌లో ఉన్న తమ ఫొటోలను పోస్ట్ చేశారు. వీరిలో యువత ఉంది. తల్లులూ ఉన్నారు. ‘దేశంలో రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు. స్త్రీ ద్వేష వ్యాఖ్యలు చేసే పురుషుల వల్ల’ అని వారు వ్యాఖ్యలు రాశారు. ‘సోచ్ బద్‌లో దేశ్ బద్‌లేగా’ (ఆలోచనాధోరణి మారిస్తే దేశం మారుతుంది) అని కూడా వారు రాశారు. ‘బిజెపి ఇంకో 50 ఏళ్లు పరిపాలించవచ్చు. కాని రిప్డ్ జీన్స్ ఎప్పటికీ ఉంటాయి’ అని ఒకరు రాశారు. ఒకామె ‘జీన్స్ సంగతి వదిలిపెట్టండి. నేను రిప్డ్ స్కర్ట్ వేసుకుంటాను’ అని పెట్టింది. ఇంకా ఎన్నో వ్యాఖ్యలు. పదవిలోకి వచ్చిన పదిరోజుల్లోనే సి.ఎం తిరత్‌సింగ్ ఈ వివాదంలో పడ్డారు. రిప్డ్ జీన్స్‌తో ఫొటోలు పెట్టినవారిలో అమితాబ్ మనవరాలు నవేలి నందా కూడా ఉంది. అయితే ఆ తర్వాత ఆమె ఆ పోస్ట్ తొలగించింది. ఆమె అమ్మమ్మ జయభాదురి ‘ఇలాంటి వ్యాఖ్యలు ఒక సి.ఎంకు తగవు. అధికారంలో ఉన్నవారు ఇలా మాట్లాడటం వల్ల స్త్రీల మీద నేరాలకు ఊతం దొరుకుతుంది’ అని విమర్శించారు.
ఎందుకు ఈ ట్రెండ్
రిప్డ్ జీన్స్ 1870లలోనే తయారైనా 1970లలో ఇవి ఫ్యాషన్ అయ్యాయి. వ్యవస్థ మీద కోపం, నిదర్శన ప్రదర్శించడానికి నాటి కుర్రకారు తమ జీన్స్ ప్యాంట్లను చించి తొడుక్కునేవారు. గాయని మడోనా ఈ ధోరణిని విస్తృతం చేసింది. ఆమె అభిమానులు ఆ ఫ్యాషన్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత జీన్స్ కంపెనీలు చిరిగిన జీన్స్‌ను తయారు చేసి మార్కెట్ చేయడం మొదలెట్టాయి. భారతదేశంలో కొత్తల్లో ఇవి అవహేళనకు గురైనా ‘ఎయిర్‌పోర్ట్ ఫ్యాషన్’గా గుర్తింపు పొందాయి. ప్రయాణాలు చేసే వారు వీటిని ధరించేవారు. ఇవాళ ఈ జీన్స్ ఇతర అన్ని జీన్స్ వలే సర్వసాధారణం.
కంగనా ప్రమేయం
ఒకవైపు హ్యాష్‌స్టాగ్ రిప్డ్‌జీన్స్ ట్రెండ్ నడుస్తుంటే మరోవైపు ఇవే జీన్స్ గురించి నటి కంగనా రనౌత్ వాటితో ఉన్న తన ఫొటోలు ట్విటర్‌లో పెట్టి కామెంట్ రాసింది. ‘రిప్డ్ జీన్స్ వేసుకున్నా మీరు అవి మీ కూల్‌నెస్‌ను స్టయిల్‌ను తెలిపేలా ఉన్నవే వేసుకోండి. అంతేతప్ప (అమ్మాయిలైనా అబ్బాయిలైనా) దిక్కులేని బిచ్చగాళ్ల వలే కనిపించే రిప్డ్‌జీన్స్ వేసుకోకండి’ అని చెప్పింది. ఈ కామెంట్స్‌కు ప్రతిస్పందన ఇంకా మొదలు కాలేదు.దేశ సంస్కృతి సభ్యత స్త్రీల బట్టల్లోనే ఉంది అని పురుషులు మాట్లాడుతున్న ప్రతిసారీ స్త్రీల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను చూసైనా పురుషులు తమ వ్యాఖ్యల్లోని అసంబద్ధతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల కోసం ఎదురు చూడక తప్పదు.
రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు
Published Fri, Mar 19 2021 12:06 AM | Last Updated on Fri, Mar 19 2021 5:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment