నాలుగునెలలు.. ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఒకే పార్టీ. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లోని రాజకీయ ఊగిసలాటకు ఇది ఓ దర్పణం. ఇరవై ఒక్కేళ్ళ చరిత్ర గల ఉత్తరాఖండ్‌లో ఇప్పటికి 11 మంది ముఖ్యమంత్రులైతే, అందులో ఒకరికి ముగ్గురు సీఎంలను తాజా బీజేపీ హయాంలోనే జనం చూశారు. తాజాగా ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్ రావత్ స్థానంలోకి పుష్కర్‌సింగ్ ధామీ రావడంతో దేవభూమిగా పేరుపడ్డ ఉత్తరాఖండ్ రాజకీయ రంగస్థలిపైకి ముచ్చటగా మూడో కృష్ణుడు వచ్చిన ట్టయింది. అధికార పక్షం న్యాయపరమైన చిక్కులను సాకుగా చెబుతూ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, కొద్ది నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇది రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు చేసిన ముఖ్యమంత్రి మార్పు అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉత్తరప్రదేశ్ నుంచి విడివడి ఏర్పడిన ఉత్తరాఖండ్ ఎప్పటిలానే తన రాజకీయ అస్థిరత రికార్డును మరోసారి నిలబెట్టుకున్నట్టయింది.
2017లో మోదీ ప్రజాదరణ హవా ఆసరాగా ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి అధికారపక్షానికి బాలారిష్టాలే. మొదట త్రివేంద్ర రావత్, తరువాత తీరథ్ సింగ్ రావత్, ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామీ – ఒకరి తరువాత ఒకరు గద్దెనెక్కారు. తాజా సీఎంకు ముందున్న ఇద్దరి హయాంలోనూ పార్టీ ఇమేజ్ దిగజారడం గమనార్హం. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలోనూ అంతర్గత కలహాలు అనేకం బయటపడ్డాయి. చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలైన బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి – నాలుగింటినీ చార్‌ధామ్ దేవస్థానం బోర్డు కిందకు తేవాలన్న త్రివేంద్ర నిర్ణయం తీవ్ర విమర్శలు, వ్యతిరేకత తెచ్చింది. దాంతో, ఆయన స్థానంలో ఈ ఏడాది మార్చిలో తీరథ్‌ను తెచ్చిపెట్టారు. త్రివేంద్ర తీసుకున్న అనేక నిర్ణయాలను తిరగదోడిన తీరథ్ ఇప్పుడిలా నాలుగునెలలకే సీఎం సీటుకు గుడ్‌బై కొట్టాల్సి రావడం కొంత ఆయన స్వయంకృతమే.
మార్చిలో పదవి చేపట్టినప్పటి నుంచి అమ్మాయిల చిరిగిన జీన్స్‌పైన, ఆధ్యాత్మికతతో కరోనాపై పోరాటం లాంటి తీరథ్ వ్యాఖ్యలు పలు వివాదాలు రేపాయి. కరోనా రెండో ఉద్ధృతి వేళ కుంభమేళా నిర్వహణ తెచ్చిన చెడ్డపేరు, పార్టీలోనూ – పాలనలోనూ గందరగోళం... ఇలా అన్నీ కలిసి ఆయనకు పదవీగండం తెచ్చాయి. తీరథ్ నిజానికి ఎమ్మెల్యే కూడా కాదు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో కొనసాగాలంటే, ఆరు నెలల లోపలే చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ, కోవిడ్–19 వల్ల ఉప ఎన్నికలు జరిగి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేకపోయిందనీ, ‘ప్రస్తుతమున్న రాజ్యాంగ సంక్షోభ పరిస్థితుల రీత్యా’ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తు న్నాననీ ఆయన డాంబికాలు పోయారు. కోవిడ్ సాకును ఆయన కవచంగా వాడుకుంటున్నా, వాస్తవం వేరు. నిజానికి, తీరథ్ తన ఎన్నికపై స్పష్టత కోసం గత నెలలో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ వెళ్ళారు. పార్టీ సైతం నైనిటాల్‌లో మూడు రోజులు ‘చింతన్ బైఠక్’ జరిపి మల్లగుల్లాలు పడింది. చివరకు, అధికారులపై అతిగా ఆధారపడుతూ, పరిపాలనలో ముద్ర వేయలేకపోయిన తీరథ్‌ను తప్పిస్తేనే మంచిదని అధిష్ఠానం భావించింది. ఫలితమే తీరథ్ స్థానంలో ధామీకి పట్టాభిషేకం.
కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఒక రకంగా ఇది ముళ్ళకిరీటమే. 21 ఏళ్ళ ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలో ఆ పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయసు వ్యక్తి ఆయనే. మాజీ సీఎం కోష్యారీ వద్ద ప్రత్యేక విధుల అధికారిగా పనిచేసి, స్వయంగా సీఎం కావడం ధామీకి దక్కిన అరుదైన ఘనత. చెప్పుకోవడానికి రికార్డుగా అది బాగానే ఉన్నా, చిక్కులూ చాలానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ కనీసం మామూలు మంత్రి పదవి చేసిన అనుభవమైనా ధామీకి లేదు. ఏబీవీపీతో అనుబంధ మున్నా, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సీనియర్లను సమన్వయం చేసు కుంటూ, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అందరినీ ఒక్క తాటిపై నడిపించడం కూడా నల్లేరుపై బండి నడకేమీ కాదు. కుమావూ ప్రాంతంలోని ఖతిమా నుంచి గడచిన రెండు ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు. నలభై అయిదేళ్ళ ధామీకి ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆరెస్సెస్)తోనూ, ఏబీవీపీ లాంటి దాని అనుబంధ సంస్థలతోనూ ముప్ఫయ్యేళ్ళ పైగా అనుబంధం. అలా పార్టీని నడిపే సిద్ధాంతాలు, పార్టీ యంత్రాంగం పనితీరుపై సంపాదించిన అనుభవమే ఆయనకిప్పుడు పెట్టుబడి. మరికొద్ది నెలల్లోనే 2022లో జరిగే ఆ రాష్ట్ర ఎన్నికల్లో సీఎంగా పార్టీకి సారథ్యం వహించడానికి అది సరిపోతుందా అన్నది ఇప్పుడు ప్రశ్న.
పాలన ఆఖరేడులో బీజేపీ ఇలా తక్షణ పరిష్కారాలు వెతుకుతూ, పదే పదే సీఎంలను మార్చడం ప్రతిపక్షాల చేతిలో బలమైన అస్త్రం కానుంది. వరుసగా రెండుసార్లు బీజేపీ ఆ రాష్ట్రంలో గెలిచిన చరిత్ర లేదు. పైపెచ్చు, 2017 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి రకరకాల కారణాలతో అక్కడ ఆ పార్టీ ప్రతిష్ఠ మసకబారుతూ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, కుంభమేళాతో వచ్చిపడ్డ ప్రజారోగ్య సంక్షోభం దానికి తోడయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లోనూ అధికారం నిలబెట్టుకోవడం ఆ పార్టీకీ, కొత్తగా పగ్గాలు చేపట్టిన ధామీకీ పెద్ద సవాలే. ధామీ వచ్చీ రాగానే, ప్రతిపక్షాలు ‘అఖండ భారత్’ పేరిట ఆయన చేసిన పాత సోషల్‌మీడియా వ్యాఖ్యలను వెలికితీసి, విమర్శలకు పదును పెట్టడం భవిష్యత్ పోరాటాలకు ఓ మచ్చుతునక. అయితే, రాష్ట్రాలకు తాయిలాల మొదలు ఎన్నికల నిర్వహణ దాకా కేంద్రం కనుసన్నల్లోనే సాగడం రాష్ట్ర బీజేపీకి అనుకూలం. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన దార్శనికత, పార్టీకి అవసరమైన ఎన్నికల చతురత చూపాల్సింది మాత్రం కొత్త ముఖ్యమంత్రే!
Comments
Please login to add a commentAdd a comment