
( ఫైల్ ఫోటో )
భిన్నమైన నిర్మాణ శైలితో, తెలుపు, నీలం రంగుల్లో కాంతులీనుతూ కనిపిస్తున్న ఈ భవనం ఎంత అద్భుతంగా ఉందో కదా! ఈ అపూర్వమైన నిర్మాణం మన ఇండియాలోనిదే. పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లోని నిర్మితమవుతున్న వేదిక్ ప్లానిటోరియం టెంపుల్. ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ఆలయ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అతిపెద్దదిగా అవతరించబోతున్న ఈ ఆలయ ఫొటోలను ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) సంస్థ నిర్వాహకులు ఇటీవలే ట్విట్టర్‌లో షేర్ చేశారు. 2010లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు విలువ వంద మిలియన్ డాలర్లట. విశ్వంలోని వివిధ గ్రహాల కదలికలకు ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారట. వేదాల ప్రకారం విశ్వం గురించి, ఇతర పురాణ కథల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
దేశంలోని ఐకానిక్ భవనాల జాబితాలో చేరనున్న ఈ ఆలయం.. వాటికన్‌లోని సెయింట్‌పాల్ కేథడ్రల్ కంటే, ఆగ్రాలోని తాజ్‌మహల్ కంటే పెద్దది. ఆలయ డోమ్ సైతం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇకనుంచి ఇస్కాన్ సంస్థ ప్రధాన కేంద్రంగా పనిచేయనున్నది. అంతేకాదు ఒకేసారి 10వేల మంది భక్తులకు వసతి కల్పించే సామర్థ్యం కలిగి ఉందట.
దీని నిర్మాణ వ్యవహారాలన్ని వ్యాపార దిగ్గజం హెన్రీఫోర్డ్ మనవడైన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం అంబరీష్ దాస్‌గా పేరు మార్చుకున్న ఆయన ఇస్కాన్ భక్తుడు. ఈ అద్భుతాన్ని వెంటనే చూడాలనిపిస్తోంది కదా... అయితే 2024 దాకా ఆగాల్సిందే. 2022నాటికే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా రెండేండ్లు ఆలస్యమయిందని ఇస్కాన్ నిర్వాహకులు తెలిపారు. సాధారణ వ్యక్తులనే ఆకట్టుకుంటున్న ఈ నిర్మాణం పూర్తవ్వడంకోసం కృష్ణుడి భక్తులు ఉత్సాహంగా ఎదురుచూస్తారనడంలో సందేహమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment