వర్చువల్ భేటీలో బైడెన్‌తో మాట్లాడుతున్న మోదీ. చిత్రంలో రాజ్‌నాథ్, జైశంకర్. (ఇన్‌సెట్లో) ఉక్రెయిన్ ప్రస్తావన వచ్చినపుడు మౌనం వహించిన బైడెన్.
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు ఫలించి శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బుచా నరమేధం ఆందోళనకరమని మోదీ అన్నారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిందని, స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇరువురు నేతలు సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్, అమెరికాలో భారత రాయబారి తరంజిత్‌సింగ్ సంధు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ సమక్షంలో వైట్‌హౌస్ సౌత్ కోర్ట్ ఆడిటోరియం నుంచి బైడెన్ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిన వేళ ఈ భేటీ జరుగుతోందన్నారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడానని, సంక్షోభాన్ని ముగించేందుకు పరస్పరం చర్చించుకోవాల్సిందిగా సూచించానని మోదీ గుర్తు చేశారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా సహజ భాగస్వాములన్నారు.
ఒకే వైఖరి: బైడెన్
ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందజేస్తున్న మానవీయ సహాయాన్ని బైడెన్ ప్రశంసించారు. యుద్ధం భారత్, అమెరికా సంబంధాలను అస్థిరపరచకుండా జాగ్రత్త పడటంతో పాటు వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లడంపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. అందుకు తమ తాజా చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రపంచ శాంతికీ ఇవి తోడ్పడతాయన్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పటిష్ట రక్షణ బంధాన్ని బైడెన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘భారత్, అమెరికా ప్రగతిశీల ప్రజాస్వామ్యాలు. కరోనా, ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పుల వంటి సమస్యలను ఎదుర్కోవడంలో ఇరు దేశాలదీ ఒకటే వైఖరి. ఇరు దేశాల ప్రజల మధ్య ఓ కుటుంబంలో, మిత్రుల మధ్య ఉండే తరహా విలువలతో కూడిన లోతైన సంబంధాలున్నాయి’’ అన్నారు. మే 24న జపాన్‌లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్రంలో మోదీతో నేరుగా ముఖాముఖి చర్చలు జరుగుతాయని ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ని భారత్ ఖండించకపోవడంపై, ఆ దేశంనుంచి చవకగా చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment