Vizianagaram: More Customers Are Shopping Online Now Due To Covid Details Inside - Sakshi
Sakshi News home page

కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు

Published Mon, Jan 10 2022 6:03 PM | Last Updated on Tue, Jan 11 2022 11:18 AM

Vizianagaram: More Customers Are Shopping Online Now Due To Covid - Sakshi

చేతిలో ఫోన్‌ ఉంటే చాలు.. ఏం కావాలన్నా ఏంచక్కా కావాల్సినది ఏదైనా ఇట్టే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేయవచ్చు. గతంలోలా ఏం కావాలన్నా మార్కెట్‌కు పరుగులు తీసే రోజులు పోయాయి. అకౌంట్‌లో డబ్బులుండాలేగాని రూపాయి నుంచి రూ.లక్షల వరకు విలువ చేసే ఏ వస్తువైనా ఫోన్‌లో బుక్‌ చేస్తే చాలు.. ఇట్టే ఇంటి ముంగిట వచ్చి చేరుతుంది.  

సాక్షి, విజయనగరం: చిన్నారులకు ఆట వస్తువులు.. దుస్తులు.. పాదరక్షలు.. చేతి గడియారాలు.. అలంకరణ వస్తువులు.. టీవీలు.. ఫ్రిజ్‌లు.. సోపాలు.. వంట సామగ్రి.. చరవాణి.. ఇలా ఏదీ కొనాలన్నా ఆరేడు దుకాణాలకు వెళ్లి వస్తువు నాణ్యత, ధర వ్యత్యాసం ఆరా తీసి కొనేవాళ్లం. ఇదంతా గతం. కాలం మారింది. వేలితో మీటితే మనకు కావాల్సింది మన ఇంటి ముంగిటకొచ్చే అవకాశం వచ్చింది. ఇంట్లో ఉంటూ నచ్చిన వస్తువులు కొనుగోలు చేసే వెసులుబాటును ఈ – కామర్స్‌ సంస్థలు అందుబాటులోకి తీసుకురావడంతో జిల్లా వాసులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు రెండింతలయ్యాయి. అన్ని రకాల బ్రాండ్లు, వస్తు సామగ్రి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటం, ప్రత్యేక రోజుల్లో రాయితీలు ప్రకటిస్తుండడంతో ఆర్డర్లు  అంతకంతకూ పెరుగుతున్నాయి. 
చదవండి: ‘సార్‌, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? వైరలవుతోన్న పోలీసుల సమాధానం!

కరోనా తెచ్చిన మార్పు 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో మానవ జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మొద టి, రెండవ దశల్లో  ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో వస్తువుల కొనుగోలుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండేది. మరోవైపు వైరస్‌ ఎక్కడ సోకుతుందోనని భయం వెంటాడేది. ఈ నేపథ్యంలో ఈ – కామర్స్‌ సంస్థలు అందించే సేవలు కొండంత అండగా నిలిచాయి. అప్పటి వరకు స్మార్ట్‌ ఫోన్‌న్‌ వినియోగించని వారు సైతం కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కొందరు మార్కెట్‌కు వెళ్లకుండా ఇంటి నుంచే కొనుగోలు చేస్తున్నారు.

ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరకులు, కూరగాయలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, శానిటరీ, స్టేషనరీ, గృహోపకరణ సామగ్రి, చెప్పులు, అలంకరణ సామగ్రి, వంటిల్లు సామగ్రి, పిండి వంటలు, ఫర్నిచర్, మందులు, వైద్యపరికరాలు, దుస్తులు ఇలా ప్రతిదీ ఆన్‌లైన్‌లో దొరుకుతుండటంతో యువతతో పాటు గృహిణులు, అన్నివర్గా ల ప్రజలు ఈ –కామర్స్‌ వినియోగదారులుగా మారుతున్నారు. వినియోగదారుల ఆదరణను గమనించిన ఈ– కామర్స్‌ సంస్థలు పండగలు, ప్రత్యేకదినాల్లో రాయితీలు ప్రకటిస్తున్నాయి. మరోవైపు నెలవారీగా వాయిదాల రూపంలో సొమ్ము చెల్లించి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆహారప్రియులు విభిన్న రుచులు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ముడిసరకులు కూడా ఆన్‌లైన్‌లో దొరకడంతో ఎక్కడెక్కడి నుంచో తెప్పించి హోటళ్ల వారు వినియోగిస్తున్నారు. 
చదవండి: పెద్దయ్యాక ఏమవుతావ్‌.. రిపోర్టర్‌ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం

ఉపాధి అవకాశాలు 
రోజులో కొంత సమయం పని చేసుకొని మిగిలిన సమయంలో చదువుకునే వారికి, రోజులో వెసులుబాటు దొరికినప్పుడు పని చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఈ – కామర్స్‌ రంగంలో వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఒక్క విజయనగరం జిల్లా కేంద్రంలోనే  వివిధ ఈ – కామర్స్‌ సంస్థల పరిధిలో 500 మంది యువత పని చేస్తున్నారు. ఆన్‌లైన్‌  వ్యాపారం ఊపందుకోవడంతో జాతీయ రహదారి పక్కనే భారీ గోదాముల్లో సరకు నిల్వ చేసుకుని అక్కడి నుంచి ఇళ్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాన్లు, ఆటోల వారికి రోజూ అద్దెలు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాలపై డెలివరీ చేసే వారికి ఉపాధి లభిస్తోంది. ఈ వ్యాపారం విస్తరించే కొద్దీ మరిన్ని అవకాశాలు పెరగనున్నాయి. 

సమయం, సొమ్ము ఆదా 
కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లకుండా ఇంటి నుంచి అవసరమైన అన్ని వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకుంటున్నాం. ఇంట్లో నుంచి ఆర్డర్‌ చేస్తే ఇంటికే వచ్చి అందజేస్తున్నారు.  దీనివల్ల సమయం, శ్రమ, సొమ్ము ఆదా అవుతోంది. ఏ సంస్థలు తక్కువ ధరకు ఇస్తున్నాయో.. నాణ్య త తదితర అంశాలు పరిశీలించే అవకాశం ఎలా గు ఉంది. మాకు నచ్చిన వస్తువలను ఆన్‌లైన్‌ ద్వారానే ఆర్డర్‌ చేసి  పొందగలుగుతున్నాం. 
– కె.సురేష్,  విజయనగరం

జిల్లాలో ఈ కామర్స్‌ సేవలు ఇలా... 
►పండగలు, ఆఫర్‌లు ప్రకటించే సమయంలో సగటున రోజు వారీ ఆర్డర్లు- 8000 నుంచి 9000 వరకు  
►సాధారణ రోజుల్లో డెలవరీలు – 5000 పైగానే  
►అత్యధికంగా డెలవరీ జరిగే రోజులు – సోమవారం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement