న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఢిల్లీకి రావాలంటూ ఆమెకు లేఖను పంపింది. అయితే తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని, మహమ్మారి వ్యాప్తి కారణంగా తాను ఢిల్లీకి ప్రయాణం చేయడం వలన తనతో పాటు తన పిల్లల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో కోల్‌కతాలోనే తన ఇంట్లో విచారించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఈడీని అభ్యర్ధిస్తూ ఓ లేఖను పంపింది. కాగా సెప్టెంబర్ ఆరో తేదీ లోగా ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ తన ఆదేశాల్లో పేర్కొంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడే ఎంపీ అభిషేక్ బెనర్జీ. కేవలం రాజకీయ ఎజెండాలో భాగంగానే తన మేనల్లుడు, అతని భార్యపై కేంద్రం ఇలాంటి చర్యలు చేపడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. కేంద్రం మాకు వ్యతిరేకంగా ఈడీని ఉపయోగిస్తోంది.
అందుకు తిరిగి ఎలా పోరాడాలో మాకు తెలుసు. అలాగే గుజరాత్ చరిత్ర కూడా మాకు తెలుసని వ్యాఖ్యానించారు. కాగా కేంద్రం, మమత మధ్య గత కొన్నాళ్ల నుంచి వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బెంగాల్‌లోని ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో అక్రమ బొగ్గు మైనింగ్‌తో లింకు ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ చేపడుతోంది.
చదవండి: ‘అమ్మ ఆవేదన’కు కదిలిన హృదయాలు
Comments
Please login to add a commentAdd a comment