ఏలియన్లు ఎలా ఉంటాయి? ఆకుపచ్చ రంగు శరీరం.. పెద్ద తల.. పెద్ద పెద్ద కళ్లు.. ఇలా ఉంటాయి.. లేదా ప్రపంచాన్ని నాశనం చేసేలా భీకర స్థాయిలో ఉంటాయి..
ఇప్పటివరకూ చాలామందికి గ్రహాంతర జీవులు అంటే మదిలో మెదిలేది ఇదే.. సినిమాలు మనకు అలాగే చూపించాయి.. ఒకవేళ నిజంగానే మన సౌర కుటుంబంలోనే ఏలియన్లు ఉంటే.. అవి ఎలా ఉంటాయి? అచ్చంగా మనిషిలాగా ఉంటాయా లేక సినిమాల్లో చూపించినట్లుగానే ఉంటాయా? దీనిపై ప్రపంచవ్యాప్తంగా కొందరు శాస్త్రవేత్తలు అన్నింటినీ విశ్లేషించి అంచనా వేశారు. సదరు గ్రహం/ఉపగ్రహంపై ఉండే గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి), వాతావరణం సాంద్రత, ఉష్ణోగ్రతలు వంటి అంశాల ఆధారంగా వాటి రూపురేఖలను రూపొందించారు.
యూఎఫ్‌వోలు కనిపించడంతో..
ఇటీవల అమెరికా గగనతలంలో ‘గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌వో)’లు కనిపించాయంటూ వార్తలు రావడం, వీడియోలు, ఫొటోలు కూడా వెల్లువెత్తడంతో.. మళ్లీ గ్రహాంతరవాసుల (ఏలియన్ల)పై చర్చ మొదలైంది. ఏలియన్లు భూమ్మీదికి రావడానికి ప్రయత్నిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. ఈ క్రమంలో మన సౌరకుటుంబంలో ఏలియన్లు ఉన్నాయా? ఉంటే ఎలా ఉండొచ్చు? అన్నదానిపై డైలీమెయిల్ వెబ్‌సైట్ పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలు సేకరించింది.
ఏ ఆకారంలోనైనా..
మన సౌర కుటుంబంలోనే కాదు.. విశ్వంలో లక్షల కోట్ల కొద్దీ ఉన్న నక్షత్ర మండలాల్లో ఎక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ గ్రహాల్లో నెలకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. మనుషులు, జెల్లీఫిష్‌లు, నత్తలు, స్క్విడ్ (ఆక్టోపస్ వంటివి)లు, ఎగిరే కీటకాలు, సూక్ష్మజీవులు.. ఇలా ఏ రూపంలో అయినా ఏలియన్లు ఉండవచ్చని అంటున్నారు.
►సౌర కుటుంబంలో అంగారక, శుక్ర గ్రహాలతోపాటు గురుడి ఉపగ్రహాలు యురోపా,గనిమీడ్, కలిస్టో.. శని ఉపగ్రహాలు ఎన్సెలాడస్, టైటాన్.. నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్,
మరుగుజ్జు గ్రహం సెరెస్‌లపై జీవం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
►భూమిని పోలిన పరిస్థితులు, వాతావరణం ఉన్నచోట.. భూమ్మీది తరహాలోనే విడిగా తల, కాళ్లు, చేతుల వంటి అవయవాలు, పెద్ద మెదడుతో కూడిన జీవులు ఉండొచ్చని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పాలియాంటాలజిస్ట్ సిమన్ కోన్వే మోరిస్ తెలిపారు. ఒకవేళ నక్షత్రానికి దూరంగా ఉండి, కాంతి తక్కువగా పడే గ్రహాల్లో అయితే కళ్లు బాగా పెద్దవిగా ఉంటాయన్నారు. అయితే ఆ జీవుల ఆకారం మనుషుల్లా ఉండొచ్చు, లేకపోవచ్చని పేర్కొన్నారు.
►ప్రస్తుత పరిస్థితులను బట్టి.. ఒకవేళ సౌర కుటుంబంలోనే జీవాన్ని కనుగొన్నా అవి ఏక కణ సూక్ష్మజీవులే అయి ఉంటాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ ఆండ్రూ కోట్స్ స్పష్టం చేశారు. కానీ విశ్వంలోని కోట్లాది నక్షత్ర లాల్లో చాలా చోట్ల ఏలియన్లు జీవించి ఉండే అవకాశం ఉందన్నారు.
భూమిలా ఉంటే..
భూమిపై ఉన్నట్టుగానే కాస్త అటూఇటూగా గ్రావిటీ, వాతావరణం, ఉష్ణోగ్రతలు ఉంటే.. ఏలియన్లు మనుషుల మాదిరిగానే ఉండే అవకాశాలు ఎక్కువ.
గ్రావిటీ ఎక్కువగా ఉంటే..
భూమికన్నా పరిమాణంలోపెద్దగా ఉండే గ్రహాల్లో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. మిగతా పరిస్థితులు భూమిలా ఉన్నా, గ్రావిటీ ఎక్కువుంటే.. ఏలియన్లు ఎత్తు తక్కువగా, దృఢమైన కండరాలతో కూడి ఉంటాయి.
గ్రావిటీ తక్కువగా ఉంటే..
చిన్నగా ఉండే గ్రహాలు/ ఉపగ్రహాల్లో గ్రావిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి చోట తేలికగా, ఎక్కువ ఎత్తుతో, బలహీనమైన కండరాలతో కూడిన జీవులు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.
వాతావరణం తక్కువగా ఉంటే..
గ్రహం/ఉపగ్రహం సైజుతో సంబంధం లేకుండా, వాతావరణం తక్కువ సాంద్రత (డెన్సిటీ)తో ఉంటే.. తక్కువ బరువుతో, చాలా పెద్ద రెక్కలతో కూడిన ఏలియన్లు ఉండొచ్చు.
నిండా మంచుతో కప్పి ఉంటే..
గురుడి ఉపగ్రహం యూరోపా మాదిరిగా మొత్తంగా మంచుతో కప్పబడి, దాని దిగువన నీటి సముద్రాలు ఉంటే.. పీతలు, ఆక్టోపస్‌ల వంటి ఆకారాల్లో ఏలియన్లు ఉండేందుకు చాన్స్ ఎక్కువ.
పొడిగా ఉండే గ్రహాలైతే..
శుక్రుడు, మార్స్ వంటి పొడిగా ఉండే వాతావరణ పరిస్థితులు ఉన్న గ్రహాలు/ఉపగ్రహాల్లో జీవం సూక్ష్మజీవుల తరహాలో ప్రాథమిక స్థాయిలో ఉండొచ్చు. వాతావరణం అనుకూలంగా మారితే పరిణామక్రమంలో ఎదిగి.. పెద్దస్థాయి జీవులుగా మారొచ్చు.
–సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment