ఢిల్లీ: మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అయితే.. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..
'దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని' రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బహిరంగంగా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితువు పలికింది. కానీ పార్లమెంట్ పదవికి రద్దు చేయడం వంటి చర్యలు వ్యక్తి హక్కుకు భంగపరచడమే గాక.. ఎన్నికలపై ప్రభావం పడుతుందని పేర్కొంది.
అయితే పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీని కారణంగా రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వానికి దూరమయ్యారు. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతటి గరిష్ఠ శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు ఎలాంటి సరైన కారణం ఇవ్వలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా.. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. రెండేళ్ల జైలు శిక్షపై స్టే
Comments
Please login to add a commentAdd a comment