రేబిస్‌తో మహిళ మృతి
శివమొగ్గ: ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్ వ్యాధి బారిన పడి మహిళ మరణించిన ఘటన జిల్లాలోని శికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గృహిణి గంగీబాయి (44) అనే మహిళ రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది.
అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. రేబిస్ సోకుండా ముందు జాగ్రత్తగా ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజెక్షన్‌ను మాత్రమే తీసుకుని ఏమీ కాదులే అని ఊరుకుంది. పది రోజుల క్రితం ఆమె ఉన్నఫళంగా అనారోగ్యం బారిన పడటంతో శికారిపుర తాలూకా ఆస్పత్రిలో, ఆపై శివమొగ్గలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృత్యువాత పడినట్లు జిల్లా సీజనల్ వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్ మల్లప్ప తెలిపారు.
పెంపుడు జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని యాంటిబయాటిక్ ద్రవం, లేదా సబ్బుతోనైనా శుభ్రంగా కడగాలన్నారు. తరువాత సమీప ఆస్పత్రికి వెళ్లి నెల రోజుల్లో నాలుగు రేబిస్ ఇంజెక్షన్లను వేయించుకోవాలని, అప్పుడే రేబిస్ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పిల్లి, కుక్క వంటి జంతువుల కాట్లపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment