Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు | Year Ender 2024 5 Big Accidents Shocked Entire Country | Sakshi
Sakshi News home page

Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు

Dec 28 2024 11:06 AM | Updated on Dec 28 2024 11:19 AM

Year Ender 2024 5 Big Accidents Shocked Entire Country

కొత్త ఏడాది(2025)లోకి మనమంతా అడుగుపెట్టేందుకు ఇక కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ తరుణంలో మన మదినిండా కొత్త ఆశలు చిగురిస్తాయి. అదేసమయంలో పాత ఊసులు కూడా మదిలో మెదులుతుంటాయి. 2024లో దేశంలో పలు విషాదకర ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వాటిలోని ముఖ్యమైన ఐదు ఉదంతాలను మనం ఎప్పటికీ మరువలేం. వాటిని ఒకసారి గుర్తుచేసుకుందాం.  

రాజ్‌కోట్ గేమింగ్ జోన్ 
2024, మే 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇది సౌరాష్ట్రలోనే అతిపెద్ద గేమింగ్ జోన్‌గా పేరొందింది. ఈ  ఘటన దరిమిలా పోలీసులు గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకితో పాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. అగ్నిమాపక శాఖ నుండి ఎన్‌ఓసీ లేకుండా ఈ గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారని, ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది.

హత్రాస్ తొక్కిసలాట
యూపీలోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. సింకదారావులోని ఒక మైదానం.. సత్సంగం సందర్భంగా శ్మశాన వాటికలా మారింది. 2024, జూలై 2న హత్రాస్‌లోని పుల్రాయి గ్రామంలో సత్సంగం నిర్వహించారు. అనంతరం భోలే బాబా తన కారులో ఆశ్రమానికి తిరుగుపయనమయ్యారు. అదే సమయంలో బాబా పాదాలను తాకేందుకు జనం ప్రయత్నించారు. ఈ సందర్బంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతిచెందారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా దేవ్ ప్రకాష్ మధుకర్‌తో సహా తొమ్మదిమందిని చేర్చారు. అయితే భోలే బాబా అలియాస్ సూరజ్‌పాల్‌ను ఈ కేసులో నిందితునిగా పేర్కొనకపోవడం విశేషం.

వయనాడ్ విలయం
2024, జూలై 30వ తేదీ రాత్రి కేరళలోని వయనాడ్‌లో ఘోర విపత్తు చోటుచేసుకుంది. ఇది యావత్‌దేశాన్ని కుదిపేసింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది  మృతిచెందారు. 180 మంది గల్లంతయ్యారు. వారం రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది.

ఝాన్సీ ఆస్పత్రిలో మంటలు
2024, నవంబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 18 మంది నవజాత శిశువులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. కొందరు శిశువులను వారి తల్లిదండ్రులు కళ్లారా చూసుకోకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం వెనుక ఆస్పత్రి పాలకవర్గ నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టమయ్యింది. షార్ట్ సర్క్యూట్‌ల విషయంలో శ్రద్ధ చూపకపోవడం, సకాలంలో పిల్లలను ప్రమాదం బారి నుంచి తప్పించకపోవడం లాంటివి పెను ప్రమాదానికి దారితీశాయి. ఈ ఘటన దరిమిలా ఝాన్సీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ను విధుల నుంచి తొలగించగా, మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.

జైపూర్ ట్యాంకర్ 
రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2024, డిసెంబర్‌ 20న అజ్మీర్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటచేసుకుంది. కంటైనర్‌ లారీ, ఎల్‌పీజీ ట్యాంకర్‌ ఢీకొన్నాయి. వెంటనే ఎల్‌పిజి ట్యాంకర్‌కున్న అవుట్‌లెట్ నాజిల్ విరిగిపోయి, గాలిలోకి విష వాయువు వ్యాపించింది. చిన్నపాటి స్పార్క్ ఇంతటి భారీ ప్రమాదానికి కారణమయ్యింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి దాదాపు 40 వాహనాలు దగ్ధమయ్యాయి. కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది.

ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement