పేదలకు మేలు జరుగుతుందన్న విశ్వాసం కలిగితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడరు అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో. తను నమ్మిన న్యాయం కోసం ఆయన పోరాడతారు. సాధించి తీరుతారు.రాజధాని అమరావతి గ్రామాలలో పేదలకు 50 వేలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తీరు, తదుపరి వారందరికి ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన వైనం చూసిన తర్వాత ఏపీలో పేద వర్గాలకు మరింత భరోసా దక్కినట్లయింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క ఈనాడు వంటి మీడియా సంస్థలు వేటకుక్కల మాదిరి వెంబడిస్తున్నా జగన్ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. పేదల పట్టాల పంపిణీ కి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడితే దానిని చెడగొట్టాలని కొందరు ప్రయత్నం చేయకపోలేదు.
కాని పోలీసులు సమర్ధంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చేశారు.కాని రైతుల ముసుగులో కొంతమంది నల్లజెండాలు, నల్ల బెలూన్లు వంటివాటితో నిరసన తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిరసనగా కూడా సరిగ్గా ఇలాగే బెలూన్ లు ఎగురవేశారు. కాని ఆ తర్వాత ఏమైందో అంతా చూశారు. మోదీ మరోసారి ఎన్నికై దేశానికి ప్రదానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా కూడా జరిగే ప్రయత్నాలు అలాగే ఉన్నాయి. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వడానికి అడ్డుతగులుతున్నారన్న విషయం రాష్ట్రం అంతా తెలిసిపోవడం వల్ల టీడీపీకి భారీగా నష్టం వాటిల్లిందట. ఈ విషయం వారి సొంత సర్వేలలో తేలిందట. దాంతో అమరావతి గ్రామాలలో శుక్రవారం చాలా తక్కువ స్థాయిలోనే ఈ నిరసనలు జరిగాయని చెప్పాలి. టీడీపీ నేతలు నేరుగా రంగంలోకి రాకుండా కొంతమేర జాగ్రత్తపడ్డారని అనుకోవచ్చు. జెఎసి నేతల పేరుతోనో, ఊరు,పేరు లేని రాజకీయ పార్టీ నేత పేరుతోనో ఆందోళన చేయించాలని చూశారు.
వారి దీక్ష శిబిరాల వద్ద ఉద్రిక్తత సృష్టించాలని యత్నించారు. పోలీసు అధికారులు మహిళలను ఏదో అన్నారని ప్రచారం చేశారు. వాటిని పెద్ద,పెద్ద అక్షరాలతో ఈనాడు పత్రికలో అచ్చేయించారు. అయినా ప్రజలలో పెద్ద కదలిక రాలేదు. యధాప్రకారం పది, ఇరవై మంది వారి శిబిరంలో కనిపించారు. పేదల పట్టాల విషయంలో తెలుగుదేశం కు కొమ్ముకాసిన వామపక్షాలు కూడా కాస్త సిగ్గుపడినట్లుగా ఉంది. వారు ఎక్కడా ప్రత్యక్ష నిరసనలలో కనిపంచలేదు. మరో వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు పట్టాల పంపిణీకి కార్యక్రమం నిర్వహిస్తే వేలాది మంది తరలివచ్చి ఆయనకు జేజేలు పలికారు. జగన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సామాజిక అమరావతికి శ్రీకారం చుట్టామని అన్నారు.
అంటే ఏదో ఒక కులం, ఒక వర్గం ప్రాధాన్యత కాకుండా, అందరికి సమప్రాతినిద్యం లబించేలా పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం అన్నమాట. గతంలో పేదలకు పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పేరుతో తెలుగుదేశం నేతలు కోర్టుకు వెళ్లినప్పుడు సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించారు. దానికి జగన్ ఇప్పుడు సమాదానం ఇచ్చినట్లయింది.పేదలకు, పెత్తందార్లకు మద్య పోరాటంగానే జగన్ తీసుకువెళుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సెంటు స్థలం స్మశానం, అని సమాధి అని చేసిన తెలివితక్కువ వ్యాఖ్యల ప్రభావం కూడా బాగానే ఉందనిపించింది. లబ్దిదారులు కొందరు దీనిపై ఆయన మీద మండిపడ్డారు.
ఒక మహిళ అయితే ముసలినక్కలు తమకు స్థలాలు రాకుండా అడ్డుకోవాలని చూశాయని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేతలు కాని, జెఎసి నేతలు కాని గతంలో హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు వస్తే తమదే విజయం అని, ప్రభుత్వం దానిని పాటించాలని అంటుండేవారు. కాని ఇప్పుడు ఇళ్ల పట్టాల కేసులో సుప్రింకోర్టు తీర్పు పేదలకు అనుకూలంగా అంటే ప్రభుత్వ వాదనను బలపరిచేలా వచ్చినా వీరు ఆందోళన వీడడం లేదు. విమర్శలు ఆపడం లేదు. పేదల స్థలాల పంపిణీని ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇదంతా చంద్రబాబు చేసిన నిర్వాకమే అని చెప్పాలి. ఆయన అనవసరంగా వేల ఎకరాల పచ్చని పంటల భూమిని సమీకరించి ,రైతులకు పని లేకుండా ఏడాదికి ఏభైవేల రూపాయల కౌలు ఇవ్వడానికి అంగీకరించిన ఫలితమే ఈ తలనొప్పి అని చెప్పాలి. అదే ఏ వెయ్యో, రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే ఏ గొడవ ఉండేదికాదు.
అప్పుడు ఏ పేదలకు ఎక్కడ నివాస స్థలాలు ఇచ్చినా ఎవరూ కాదనేవారు కాదు. అలాకాకుండా మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చడంతో వచ్చిన చిక్కు ఇదంతా. తను తీసుకు వచ్చిన చట్టంలోనే ఐదు శాతం భూమి పేదలకు ఇవ్వాలని ఉంది. దానిని అమలు చేస్తుంటే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.పట్టాల పంపిణీ సభలో మాట్లాడిన ఇద్దరు మహిళలు తమ ఆవేదనను పంచుకుంటూ సొంత ఇల్లు అన్నది తమ చిరకాల వాంఛ అని, దానిని జగన్ తీర్చారని చాలా సంతృప్తిగా మాట్లాడారు. ఒకరైతే కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుపడుతున్నా, జగన్ తమకోసం పోరాడారని వారు అభిప్రాయ పడ్డారు. ముఖ్యమంత్రి కూడా వచ్చే జూలై ఎనిమిది అంటే దివంగత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాటికి ఈ స్థలాలలో ఇళ్ల నిర్మాణం ఆరంభం అవుతుందని ప్రకటించడం లబ్దిదారులలో ఎంతో సంతోషం కలిగించింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నరకాసురుడిని అయినా నమ్మవచ్చేమో కాని, నారా చంద్రబాబును మాత్రం నమ్మవద్దని కొత్త డైలాగు విసిరారు. యదా ప్రకారం ఎల్లో మీడియా తన ప్రభుత్వానికి సృష్టిస్తున్న అడ్డంకులను ప్రజలకు వివరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం చానల్ ఒకటి టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పట్టాలు రద్దు అవుతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు.వైసిపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజదానిలో ఇళ్ల స్థలాల పంపిణీని ఒక వారం రోజుల కార్యక్రమంగా రూపొందించింది. తద్వారా రాష్ట్రవ్యాప్త ప్రజలపై ఒక ప్రభావం పడాలని యత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని, వారికి మేలు చేస్తుంటే చూడలేకపోతోందని వైసిపి ప్రచారం చేయడానికి ఈ అవకాశం వినియోగించుకుంటుంది. అందుకు తెలుగుదేశం పార్టీనే చాన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా జగన్ పట్టుదల, దక్షతలకు ఈ ఇంత వేగంగా ఈ ఇళ్ల స్థలాల పంపిణీ నిదర్శనం అని చెప్పవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment