నిర్మల్: ఏఐసీసీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నారా?.. సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ఓ క్లారిటీ ఇవ్వనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్‌శ్రేణుల నుంచి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ క్షేత్రస్థాయి ప్రభావానికి తగ్గట్లు ఏలేటి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈమేరకు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం పార్టీ ప్రధాన కార్యకర్తలు, తన ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు, అనుచరులు బీజేపీలో చేరితేనే ఎన్నికల సమరంలో గెలువగలమని వెల్లడించినట్లు తెలిసింది. వారి నిర్ణయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటానన్న మహేశ్వర్‌రెడ్డి తుది నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
భవిష్యత్‌పై..
ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్‌ఎస్‌లో ఇప్పటికే గులాబీ శ్రేణుల్లో సందడి నెలకొంది. అదే పార్టీలో శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్‌లాంటి సీనియర్లు ఎదురుతిరగడమూ చర్చనీయాంశమైంది. మరోవైపు కాంగ్రెస్‌లోనూ పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా యి, ఓటర్ల తీరు ఎలా ఉందని ఆరా తీస్తున్నారు.
కమలంవైపే అనుచరుల మొగ్గు..
ప్రస్తుత పార్టీలో ఉండటమా.. పార్టీ మారడమా.. ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి.. అనే అంశాలపై ఏలేటి తన ప్రధాన అనుచరులు, ముఖ్య నాయకులతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్తేనే బాగుంటుందన్న అభిప్రాయం ఎక్కువమంది కార్యకర్తల నుంచి వచ్చినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కంటే ప్రస్తుతం బీజేపీ మెరుగ్గా ఉందన్న అభిప్రాయాన్ని మెజార్టీ నాయకులు వెల్లడించినట్లు సమాచారం. మహేశ్వర్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. తన వెంటే ఉంటామని, ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పినట్లు ఓ సీనియర్ నేత వెల్లడించారు. మరోవైపు మహేశ్వర్‌రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారని, ఈనెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ సభరోజే ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నేడో రేపో ఢిల్లీకి కూడా వెళ్తారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఆలోచించి నిర్ణయం..
రాజకీయ భవిష్యత్‌పై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే పలువురు నాయకులతో సమావేశం నిర్వహించా. బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ నుంచీ ఆహ్వానం ఉంది. కానీ పార్టీ మార్పుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం లేదు. మరోసారి అందరితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటా.
– ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment