విద్యార్థులకు ఐ కేర్..!
భైంసాటౌన్: విద్యార్థుల్లో దృష్టిలోపం నివారణే లక్ష్యంగా జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అవసరమైనవారికి మందులు అందిస్తున్నారు. అయితే, ఈసారి తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆదేశాల మేరకు 5 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు ఆప్తాల్మజిస్ట్ ఆధ్వర్యంలో మరోసారి పరీక్షలు జరిపి కంటి అద్దాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైనవారికి అద్దాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో...
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. వీరు పాఠశాలస్థాయిలో ఆప్తోమెట్రిస్ట్‌లతో 1,385 మంది విద్యార్థులను పరీక్షించారు. వీరిలో దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు మళ్లీ పరీక్షలు చేస్తున్నారు. విద్యార్థుల్లో కంటి సమస్యలు పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే దృష్టిలోపం ఉన్న విద్యార్థులను ఆర్బీఎస్‌కే వాహనాల్లో జీజీహెచ్, భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించి పరీక్షిస్తున్నారు. కార్యక్రమం 15 రోజులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
దృష్టిలోపం నివారణే లక్ష్యంగా కార్యక్రమం అమలు
జిల్లావ్యాప్తంగా స్టూడెంట్లకు కంటి పరీక్షలు
447 మందికి కంటి అద్దాలు
దృష్టిలోపమున్న విద్యార్థులకు ఈనెల 17 నుంచి జిల్లాకేంద్రంలోని జీజీహెచ్‌తోపాటు భైంసాలోని ఏరియాస్పత్రిలో మరోసారి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 448 మంది విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 447 మందికి కంటి అద్దాలు అవసరమని నిర్ధారించారు. మార్చి మొదటివారం వరకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షలు నిర్వహిస్తున్నాం
ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జీజీహెచ్‌లో కంటి వైద్యులతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. లోపాలు ఉన్న వారిని గుర్తించి వైద్యం అందిస్తున్నాం. 448 మంది విద్యార్థులకు దృష్టిలోపమున్నట్లు గుర్తించాం. కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– నయనరెడ్డి,
ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment