ఆరోగ్య కిట్లు అందేదెప్పుడో..!
● ప్రభుత్వం నుంచి నిలిచిన సరఫరా ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే బాలికల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత ప్రభుత్వం శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేసింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రతీ మూడు నెలలకోసారి కిట్లు అందించింది. ఏడాదిన్నర కాలం సజావుగా సాగిన ఈ కార్యక్రమం తర్వాత నిలిచిపోయింది. నాలుగేళ్లుగా విద్యార్థినులకు కిట్లు అందించడం లేదు. దీంతో బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థినులతోపాటు పోషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
8,9,10 తరగతుల నుంచి..
గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతులతోపాటు ఇంటర్ విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్స్, సబ్బులు, కొబ్బరి నూనె, షాంపు బాటిల్, టూత్ పేస్ట్, బ్రష్, పౌడర్ తదితర 15 రకాల వస్తువులు కలిగిన హెల్త్ కిట్లను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏడాదిన్న ర కాలం సజావుగా కిట్లు అందజేసింది. అనంతరం కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు రావడంతో హెల్త్ కిట్ల పంపిణీ నిలిచింది.
విద్యార్థినుల వివరాలు
జిల్లాలో 164 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎనిమి దో తరగతిలో 2,855 మంది విద్యార్థినులు, తొమ్మిదో తరగతిలో 2,835 మంది, 10వ తరగతిలో 2,476 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ విద్యార్థినులు 1,013 మంది, సెకండియర్ విద్యార్థినులు 941 మంది ఉన్నారు.
అందని కాస్మొటిక్ చార్జీలు
జిల్లాలో 18 కేజీబీవీలు, 18 కళాశాలలున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంత్సరం విద్యార్థినులు 2,880 మంది ఉన్నారు. కేజీబీవీల్లో 6,7,8,9,10 తరగతుల్లో ఒక్కో తరగతికి 40 మంది చొప్పున 18 కేజీబీవీల్లో మొత్తం 3,600 బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఈ సంవత్సరం నుంచి కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.100 చొప్పున అందజేస్తామని చెప్పడటంతో ఎస్వోలు విద్యార్థినులతో బ్యాంక్ ఖాతాలు తీయించారు. ఈ ప్రక్రియ గత డిసెంబర్ చివరి వరకు కొనసాగిందని కేజీబీవీల ఎస్వోలు చెబుతున్నారు. విద్యార్థినుల ఖాతాల్లో నేరుగా నెలకు రూ.100 జమ అవుతున్నట్లు అధికారులు తెలిపినా ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థినికి జమ కాలేదని ఎస్వోలు తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినులకు హెల్త్ కిట్లు, కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment