
‘ఎమ్మెల్సీ’ ప్రలోభాలు షురూ
● ఉన్నచోటికే మందు, విందు ● ఇంటికే పైసల్... ● టీచర్లు, గ్రాడ్యుయేట్లకు తాయిలాలు
నిర్మల్‌ఖిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరుతోంది.. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లుగా ఉండే గ్రా డ్యుయేట్లు, టీచర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉదయం వాకింగ్ చేసే వారితో మొదలు పెట్టి.. రాత్రి మందు, విందు సిట్టింగ్‌ల వరకు సాగుతోంది. ప్రధానంగా ఉపాధ్యాయులైతే నలుగురైదుగురిని ఒక బృందంగా ఏర్పాటు చేసి హోటల్ రూంలు బుక్ చేసి.. అక్కడికే వారికి అవసరమైన మందు, విందు పంపుతున్నారు. ఎలాగైనా తమ వారికి ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సోష ల్ మీడియాలో సైతం తగ్గేదేలే.. అన్నట్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుచరులతోపాటు ఉపాధ్యా య సంఘాల నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. మండలాల వారీగా ఇన్‌చార్జీలను నియమించుకుని బాధ్యతలు అప్పగించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను కూడా ప్రచారానికి విరివిగా వినియోగిస్తున్నారు.
గంపగుత్తా ఓట్ల కోసం..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. దీంతో ప్రతీ ఓటరు ఇంటికి పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుదారులు వెళ్లి కలుస్తున్నారు. ఓటరుతోపాటు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 10 నుంచి 12 మంది వరకు బృందంగా ఉంటే వారికి ప్రత్యేక తాయిలాలు అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్నికలకు రెండు రోజుల ముందే మద్యం షాపులు మూసివేయనుండడంతో సరుకు నిల్వ ఉంచుతున్నారు. మరోవైపు ఆత్మీయ సమ్మేళనాల పేరిట 50, 100 మందితో ప్రత్యేక మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘం నేతలు తమ సంఘం జిల్లా, మండల కార్యవర్గ సభ్యులతో బృందాలుగా ఏర్పడి నిర్మల్ ఖానాపూర్, భైంసా తదితర పట్టణాలతోపాటు ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్లను ఇంటికి వెళ్లి మరీ కలుస్తున్నారు.
మందు, విందు, నగదు...
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వారికి కావాల్సినవి సమకూరుస్తున్నారు. నిర్మల్ జిల్లాలో తయారుచేసి పెట్టుకున్న లిస్టు ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లు చేసి సమయం తీసుకుంటున్నారు. సాయంత్రం వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక్కొక్కరికి రూ.3 వేలు, ఉపాధ్యాయ ఓటర్లకు దాదాపు రూ.5 వేల వరకు ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
ముగ్గురి మధ్యే పోటీ..
గ్రాడ్యుయేట్ ఎన్నికల సమరంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున వూట్కూరి నరేందర్‌రెడ్డి పోటీలో ఉండగా, బీజేపీ తరఫున అంజిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ తరఫున అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ మద్దతుతో మల్క కొమురయ్య, పీఆర్టీయూ మద్దతుతో వంగ మహేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారి అనుచరులు ప్రచారంలో ముందున్నారు. ఇక జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు యాటకారి సాయన్న తన ఉద్యోగానికి వీఆర్‌ఎస్ ప్రకటించి బీఎస్పీ మద్దతుతో బరిలో నిలిచారు. ప్రధానంగా పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు అన్నిరకాల తాయిలాలు అందించేందుకు వెనకాడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment