రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
బెల్లంపల్లి: మద్యానికి బానిసై జల్సాల కోసం అప్పు చేసిన యువకుడు తీర్చేమార్గం లేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెల్లంపల్లి జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వర్ కథనం ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన దుర్గం క్రాంతి (29) జులాయిగా తిరిగేవాడు. అడపాదడపా మంచిర్యాలకు చెందిన ఓ రియల్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మద్యం తాగేవాడు. అవివాహితుడైన క్రాంతి నెలక్రితం తల్లి దుర్గం వెంకటమ్మను బతిమిలాడటంతో ఆమె రూ.10 వేలు వేరే వ్యక్తుల వద్ద అప్పు అడిగి ఇచ్చింది. ఆ డబ్బులను తాగుడుకు ఖర్చు చేశాడు. మరోపక్క అప్పు ఇచ్చినవారు అడగడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పు తీర్చేమార్గం లేక క్రాంతి సోమవారం అర్ధరాత్రి సుబ్బారావుపల్లి శివారు వైపు వెళ్లి గుర్తుతెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్గం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment