
ముదురుతున్న ఎండలు
● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● భయాందోళనలో జిల్లా ప్రజలు ● అప్రమత్తతే మేలంటున్న డాక్టర్లు
భైంసాటౌన్: మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనాలు పగటివేళ బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే జాగ్రత్తలు పాటించి బయటకు వస్తున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగా, మరోవైపు పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. పెరుగుతున్న ఎండల కారణంగా ఈనెల 15నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
40 డిగ్రీలకు చేరువగా..
జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మొదలయ్యాయి. ఈనెల ప్రారంభంలో గరిష్ణ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు ఉండగా, శుక్రవారం అధికంగా 39.5 డిగ్రీలుగా నమోదైంది. దీంతో హోలీ పండుగ వేళ జనాలు ఎండకు భయపడి ఉదయమే వేడుక జరుపుకొని ఇళ్లకు చేరుకున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముందు జాగ్రత్తలే మేలు
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో పనిచేసేవారు, ద్విచ క్ర వాహనాలపై దూర ప్రయాణాలు చేసేవారు వడదెబ్బ బారిన పడే ప్రమాదముందని పే ర్కొంటున్నారు. వడదెబ్బ బారిన పడితే కళ్లు తి రగడం, తీవ్రమైన తలనొప్పి, గుండెదడ, చెమటలు ఎక్కువగా పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుందని పేర్కొన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ఎండలో పనిచేయరాదని తెలిపారు. ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరాలని పేర్కొన్నారు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలి. ఎండలో వెళ్లినప్పు డు రక్షణగా గొడుగు వాడాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. ప్రతీరోజు ఎక్కువ మోతా దులో నీటిని తీసుకోవాలి. పండ్ల రసాలు, కొ బ్బరి నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. – ఎస్.కాశీనాథ్,
ఏరియాస్పత్రి సూపరింటెండెంట్, భైంసా
జిల్లాలో ఐదురోజుల ఉష్ణోగ్రతలు
తేదీ గరిష్టం కనిష్టం
10 37.5 21.5
11 37.6 22.5
12 38.4 23.3
13 39 24
14 39.5 24.4