భైంసాటౌన్: మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్, ఎ మర్జెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. ఇందులో భాగంగా భైంసా పట్టణంలో శనివారం పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఓ మహిళ ప్రాణాన్ని కాపాడారు. వివరాలు.. పట్టణంలోని బోయిగల్లికి చెందిన తాండ్రోల్ల రుక్మాబాయి (55)ని ఆమె భర్త పోశెట్టి ఇంట్లో ఏ పని చేయడం లేదని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో అక్కడున్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు సంగీత, అనిత సకాలంలో చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆమె కొడుకు భీమేశ్‌కు అప్పగించారు. అలాగే ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళను కాపాడిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.