
ఆన్‌లైన్‌లో పేరున్నా సన్న బియ్యం
● నేటి నుంచి పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా రేషన్‌కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డులు మంజూరైనా గ్రామసభల్లో అర్హుల జాబితా వెల్లడి సమయంలో తలెత్తిన సమస్యలతో ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డాయి. మరోవైపు మీ సేవల్లో కొత్త కార్డుల మార్పులు, చేర్పుల కోసం ఇంకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇక సన్న బియ్యం ఇప్పటికే రేషన్ దుకాణాలకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి మొత్తం కోటాలో కనీసం 50శాతం వరకు సరఫరా చేశారు. ప్రతినెలా బియ్యం రవాణాలో అనేక చోట్ల జాప్యం జరుగుతున్నా ఈసారి అలా జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు రేషన్ దుకాణాల వద్ద హాజరు కానున్నారు.
ఉమ్మడి జిల్లా వివరాలు
రేషన్ దుకాణాలు : 1712
రేషన్ కార్డులు: 7.59లక్షలు
లబ్ధిదారులు: 24.12లక్షలు
కొత్త రేషన్ కార్డుల అర్జీలు 1.55లక్షలు
(ప్రజాపాలనలో వచ్చినవి)
కొత్తగా మంజూరైనవి: 72,276