
నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, తద్వారా అభ్యసన ఫలితాలు సాధించుకోవచ్చని డీఈవో రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పంచశీల్ బీఈడీ కళాశాలలో నూతనంగా పదోన్నతి పొందిన పీజీహెచ్‌ఎం, సీఎస్ హెచ్‌ఎంలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ తరగతి గదిలో విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిలో ఆలోచన శక్తిని పెంపొందించేలా ఉత్తేజపరచాలని సూచించారు. పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులను భావి భారత పౌరులుగా దిద్దేలా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని తెలిపారు. విద్యార్థులను ఉత్తేజపరిచేలా ఆటలు, వ్యాసరచన పోటీలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. పోషకుల సహాయంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. శిక్షణలో అధికారులు రమణారెడ్డి, నరసయ్య, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.