
ప్రయోగశాలను సందర్శించిన కలెక్టర్
సోన్: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సందర్శించారు. పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను పరిశీలించారు. ప్రయోగశాలలో విద్యార్థులకు ఖగోళ, భౌతిక శాస్త్రాల ప్రయోగాలు, మానవ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించి పరిజ్ఞానం పెంపొందించేలా వివిధ రకాల నమూనాలు ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రయో గశాలలోని నమూనాలతో ఆచరణాత్మక విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులకు అన్ని అంశాలు సులువుగా అర్థమవుతాయని తెలిపారు. ఈ ప్రయోగశాలను ఉపయోగించి పాఠశాలలోని విద్యార్థులందరికీ నైపుణ్యాలు పెంపొందించేలా ఆచారణాత్మక విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ ఇలాంటి ప్రయోగశాల లేదని తెలిపారు. ఇలాంటి సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తి, నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. కాగా, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా, కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవతో సుమారు రూ.19.50లక్షలు ఖర్చు చేసి మొదటగా జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ కేజీబీవీ, మామడ మండలం పొన్కల్ ప్రభుత్వ పాఠశాల, తాండూరు మండలం బోసి ప్రభుత్వ పాఠశాలలో ఒక్కోచోట సుమారు రూ.5లక్షల వ్యయంతో ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రామారావు, సెక్టోరల్ అధికారి రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి వినోద్, తహసీల్దార్ మల్లేశ్, మండల విద్యాధికారి పరమేశ్వర్, హెచ్‌ఎం ఆరాధన, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.