
లైంగిక వేధింపులు నిరోధించాలి
నిర్మల్‌చైన్‌గేట్: బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు, హింసను నిరోధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర’ చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించరు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల, మహిళల సమస్యలపై శ్రద్ధ చూపకుండా ఉద్యమాలను అణచివేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, సాయిలీల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, ప్రసాద, ఉపాధ్యక్షులు సుజాత, అంగన్‌వాడీ యూనియన్ నేతలు లలిత, శైలజ, ఆశ యూనియన్ నేతలు సుజాత, చంద్రకళ, వ్యవసా య కార్మిక సంఘం నాయకులు తిరుపతి, నూతన్‌కుమార్, మురళీ మోహన్, గిరిజన సంఘం నాయకులు శంభు, కేవీపీస్ నేత పోశెట్టి పాల్గొన్నారు.