
‘సరిహద్దు’లో క్షీరవిప్లవం
తానూరు: మహారాష్ట్ర సరిహద్దులోగల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఇంటింటా పాడి పశువులు పెంచుతున్నారు. వ్యవసాయం చేసుకుంటూ నే పాల దిగుబడి సాధిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. మండలంలోని హిప్నెల్లి, బెంబర, బోరిగాం, బోల్సా, బోసి, వర్‌జడి, కోలూరు, మసల్గతండా, బోంద్రట్ గ్రామాల్లో ఇంటింటా ఆవులు, గేదెలున్నాయి. పూర్వీకుల నుంచి పశుపోషణ ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామాల ప్రజలు మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ.. పాలు, పాల ఉత్పత్తులనే అధికంగా వినియోగిస్తారు. అందుకే ఏ ఇంటా చూసినా తప్పనిసరిగా ఆవులు లేదా గేదెలను పెంచుకుంటారు.
లాభదాయకం కావడంతోనే..
తమ ఇళ్లలో పెంచుకుంటున్న పాడి పశువులు ఇచ్చే పాలను రైతులు విక్రయించి లాభాలు గడిస్తున్నా రు. ఉదయం, సాయంత్రం వేళలో తీసిన పాలను సమీపంలోని హోటళ్లు, గృహాలకు సప్లయ్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో లీటర్ పాలను రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తారు. కిలో పెరుగును రూ.80 వరకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. పశువులను అధికంగా పెంచుకుంటున్న రైతులు పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. పశువులను పోషించగా వాటి ద్వారా వచ్చే పాలను విక్రయించడమే కా కుండా పేడను సేంద్రియ ఎరువుగా పంటలకు వే స్తుంటారు. పంటల సాగులో సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
పశువుల కాపరులకు ఉపాధి
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పోషించుకుంటున్న ఆవులు, గేదెలతో పశువుల కాపర్లకు కూడా ఉపాధి దొరుకుతోంది. నెలకు ఒక్కో ఆవును మేపినందుకు రూ.500, గేదెకు రూ.600 తీసుకుంటారు. ఉద యం వేళ పశువుల కాపరులు ఇంటింటికీ చేరుకుంటారు. పశువులను అటవీ ప్రాంతానికి తోలుకెళ్తా రు. అక్కడ దినమంతా అవి మేత మేసిన తర్వాత సాయంత్రం తిరిగి ఇంటికి చేరుస్తారు.
వ్యవసాయంతోపాటు పశుపోషణ
ఇంటింటా ఆవులు, గేదెల పెంపకం
హోటళ్లు, గృహాల్లో పాల విక్రయం
లాభాలు గడిస్తున్న పశుపోషకులు
తానూరులోని హోటల్‌లో పాలు విక్రయిస్తున్న ఈ రైతు పేరు పోతన్న. ఇతనికి మూడు గేదెలున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం 16 లీటర్ల పాలు ఇస్తాయి. వీటిని గృహాలు, హోటళ్లకు సప్లయ్ చేస్తాడు. మిగిలిన వాటితో పెరుగు, నెయ్యి తయారు చేసి విక్రయిస్తాడు. స్వచ్ఛమైన నెయ్యి కావడంతో కిలో రూ.800కు అమ్ముతున్నాడు. పశుపోషణతో అధిక లాభాలున్నాయని పోతన్న చెబుతున్నాడు. ఇలా మండలంలోని చాలా మంది రైతులు పాడి పశువుల పెంపకం ద్వారా లాభాలు గడిస్తున్నారు.

‘సరిహద్దు’లో క్షీరవిప్లవం