
● భయంతో దుకాణాలు మూసేసిన వ్యాపారులు
భైంసాటౌన్:పట్టణంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలకు రావడంతో స్థానికంగా వ్యాపారుల్లో కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ అధికారులు విజయలక్ష్మి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి తనిఖీల కోసం వచ్చారు. ముందుగా బస్టాండ్ సమీపంలోని బంగారు, వెండి దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలియడంతో మిగిలిన దుకాణదారులతోపాటు మహాలక్ష్మి కాంప్లెక్స్‌లోని దుకాణాలను హడావుడిగా మూసివేశారు. అనంతరం బంగారు, వెండి వర్తకుల అసోసియేషన్ హాల్‌లో అధికారులు దుకాణదారులతో సమావేశమయ్యారు. ఇటీవల నిర్మల్‌లోనూ పలు బంగారు వెండి వర్తక దుకాణాల్లో, వ్యాపారుల ఇళ్లలో ఐటీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. భైంసాలో మాత్రం వర్తకులతో అసోసియేషన్ హాల్‌లో చర్చలు జరపడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై ఏసీటీవో విజయలక్ష్మిని వివరణ కోరగా, తాము తనిఖీలు, దాడులు చేసేందుకు రాలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యాపారులకు వాణిజ్య పన్నులపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతీ వ్యాపారి తప్పక జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. భైంసాలోని ఎందరి వద్ద లైసెన్సులు ఉన్నాయని ప్రశ్నించగా, తమ వద్ద వివరాలు లేవని సమాధానం దాటవేశారు.