
‘స్థానిక’ రిజర్వేషన్లకు కుస్తీ!
ఆర్డీవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో ప్రక్రియ కసరత్తులో యంత్రాంగం తలమునకలు మంగళవారం సాయంత్రానికి పూర్తికాని ప్రక్రియ
నిర్మల్‌చైన్‌గేట్:రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం వేగవంతమైన చర్యలు చేపట్టింది. కలెక్టర్ నేతృత్వంలో అధికారులు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా రిజర్వేషన్ల ఖరారు కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్డీవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యం జరుగుతున్న ప్రక్రియ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు కూడా పూర్తి కాలేదు.
పంచాయతీలు, పరిషత్ స్థానాలు ఇలా..
జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులు ఉన్నాయి. 18 జెడ్పీటీసీ స్థానాలు, 17 ఎంపీపీ స్థానాలు, 157 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీలను, జెడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను పరోక్షంగా ఎన్నుకుంటారు. ఎన్నికల తేదీలు ఖరారైన వెంటనే నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఓటరు జాబితాలు సిద్ధం చేసిన అధికారులు రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. బుధవారం నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
మండలాల వారీగా రిజర్వేషన్ లెక్కలు..
నిర్మల్ జిల్లాలో డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో గోవింద్ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారులు రిజర్వేషన్ల కసరత్తులో నిమగ్నమయ్యారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, 2024 కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించనున్నారు. మండలాల వారీగా జనాభా శాతాలను లెక్కించి జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. 2006, 2013, 2019 రిజర్వేషన్లను పరిశీలిస్తూ కొత్త జాబితాలను రూపొందిస్తున్నారు.
జీవో కోసం ఎదురుచూపు..
రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వివరాలను మండలాల వారీగా తేల్చాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటరు జాబితాల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జీవో విడుదలైన తర్వాతే రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
రిజర్వేషన్లలో మార్పు...
ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించనుండటంతో గత రిజర్వేషన్లు పూర్తిగా మారనున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లనే కొనసాగించారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రొటేషన్ పద్ధతిని అమలు చేస్తూ గత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతోపాటు బీసీలకు అధిక స్థానాలను కేటాయించనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తర్వాత మిగిలిన స్థానాలను జనరల్ కేటగిరీకి కేటాయిస్తారు. అందులో 50% మహిళలకు రిజర్వ్ చేయడానికి చర్యలు చేపడతారు.
జిల్లా వివరాలు..
పంచాయతీ డివిజన్లు 02
జెడ్పీటీసీ స్థానాలు 18
ఎంపీటీసీ స్థానాలు 157
పోలింగ్ కేంద్రాలు 892
పంచాయతీలు 400
వార్డులు 3,368
మొత్తం ఓటర్లు 4,49,302
పురుషులు 2,13,805
మహిళలు 2,35,485
ఇతరులు 12