
ఆర్జీయూకేటీలో ఆయుధపూజ
బాసర: విజయదశమి వేడుకల్లో భాగంగా బాసర ఆర్జీయూకేటీలో వివిధ విభాగాల పరిశోధనలో శనివారం ఆయుధపూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా అర్చకులు కిశోర్ సరస్వతి, లక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాల ముందు ల్యాబ్ పరికరాలు, యంత్రాలపై పురోహితుడు పూజించి ఇచ్చిన అక్షతలను, జలాన్ని వాటిపై చల్లారు. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ఆయుధపూజ అనేది వ్యవసాయ ఉపకారణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడినదన్నారు. యూనివర్సిటీలో ఉన్న భారీ యంత్రాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయని, అందుకే శుభ్రం చేసి పూజ చేసినట్లు వెల్లడించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ సాధారణంగా ఆయుధపూజను నవమి నాడు జరుపుతారని, యూనివర్సిటీకి దసరా సెలవులు ప్రకటించినందున ముందస్తుగా నిర్వహించామని తెలిపారు.