నిజామాబాద్: అమ్మా.. కార్యక్రమం పూర్తికాగానే మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిన కొడుకు, తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన మండలకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. రోడ్డుప్రమాదంలో మృతిచెందాడని తెలిసి ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని దేవునగర్ క్యాంప్‌కు చెందిన సలటికి సులోచన అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది. ఆమె కొడుకు అభిషేక్(22) బీటెక్ చదువుతున్నా డు.
దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం డిచ్ పల్లిలోని కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సులోచనను ఆమె కొడుకు అభిషేక్ బైక్‌పై తీసుకువచ్చాడు. ప్రోగ్రాం పూర్తికాగానే వచ్చి, ఇంటికి తీసుకెళతానని తల్లికి చెప్పి అతడు బయలుదేరాడు. అభిషేక్ బ్యాంక్ బ్యాంక్ పనిమీద అదే గ్రామానికి చెందిన స్నేహితుడు మంగళి వినోద్‌తో కలిసి ఇందల్వాయి స్టేషన్‌కు బయలుదేరాడు. నాగ్‌పూర్ గేట్ వద్ద గల హైవే బ్రిడ్జిపై వీరి బైక్‌ను ఆర్మూర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కంటెయినర్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అభిషేక్, వినోద్‌లు ట్రక్కు టైర్ల కింద చిక్కుకున్నా, ట్రక్కు కొద్ది దూరం వెళ్లింది. అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందగా, వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న డిచ్‌పల్లి సీఐ కృష్ణ, ఎస్సై గణేష్‌లు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ కింద చిక్కుకున్న ఇద్దరిని బయటకు తీశారు. వినోద్‌ను హైవే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి కుడికాలు తీసివేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment