మంత్రి ప్రశాంత్‌రెడ్డి టార్గెట్‌గా బరిలో అన్నపూర్ణమ్మ | - | Sakshi
Sakshi News home page

మంత్రి ప్రశాంత్‌రెడ్డి టార్గెట్‌గా బరిలో అన్నపూర్ణమ్మ

Published Thu, Oct 5 2023 1:14 AM | Last Updated on Thu, Oct 5 2023 11:05 AM

- - Sakshi

నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు శాసనసభ స్థానాల్లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీజేపీ మొదటి జాబితాలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ మంత్రి ప్రశాంత్‌రెడ్డి టార్గెట్‌గా మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను ఫైనల్‌ చేసినట్లు సమాచారం. విలువలు కలిగిన రాజకీయనేతగా ఆమెకు పేరుంది. బోధన్‌లో ఇద్దరు పోటీ పడుతుండగా, మరో మూడు నియోజకవర్గాల్లో ఒక్కొక్కరి పేర్లే వినిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: శాసనసభ ఎన్నికల కోడ్‌ సమీపిస్తున్న తరుణంలో బీజేపీలో టిక్కెట్ల ప్రకటనకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు శాసనసభ స్థానాల్లో నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మొదటి జాబితాలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పసుపు రైతులు అధికంగా ఉన్న బాల్కొండ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మను బరిలోకి దించేందుకు నిర్ణయం ఖరారైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అధిష్టానం పెద్దలతో మాట్లాడి అన్నపూర్ణమ్మ పేరును ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది.

బాల్కొండ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి టార్గెట్‌గా ఎంపీ అర్వింద్‌ అన్నపూర్ణమ్మను రంగంలోకి దింపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అన్నపూర్ణమ్మ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జిల్లాలో గట్టి పట్టు సంపాదించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన అన్నపూర్ణమ్మ లాంటి నాయకురాలిని బరిలోకి దించితే రైతులు, మహిళలు, యువకుల నుంచి తిరుగులేని సహకారం లభిస్తుందనే ఉద్దేశంలో ఎంపీ అర్వింద్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో బాల్కొండ స్థానంలో త్రిముఖ పోటీ జరుగనుంది.

► నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణకు టిక్కెట్టు ఖరారు అయినట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల సమయంలో ధన్‌పాల్‌ సూర్యనారాయణకు చివరి నిముషంలో టిక్కెట్టు చేజారిపోయింది. ఈసారి మాత్రం తొలి జాబితాలోనే ధన్‌పాల్‌ టిక్కెట్టు ప్రకటించనున్నట్లు సమాచారం. 

► నిజామాబాద్‌ రూరల్‌ నుంచి డిచ్‌పల్లి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కులాచారి దినేశ్‌కు ఆర్మూర్‌ నియోజకవర్గం టిక్కెట్టును అంకాపూర్‌కు చెందిన బడా వ్యాపారి పైడి రాకేష్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు టిక్కెట్లను మొదటి జాబితాలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అర్వింద్‌ ఇప్పటికే ఈ విషయమై కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందినట్లు తెలుస్తోంది.

► బోధన్‌ టిక్కెట్టు విషయంలో మాత్రం మేడపాటి ప్రకాష్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డిల మధ్య పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ టిక్కెట్టు విషయంలో వివిధ అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. మేడపాటి ప్రకాష్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మేడపాటికి మంచి పేరుంది. ఈ నెల 7న ఎంపీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎడపల్లిలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు సైతం చురుగ్గా నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో నియోజకవర్గంలోని 6,500 మంది పార్టీ కార్యకర్తలందరికీ బీమా సౌకర్యం సైతం సొంత ఖర్చుతో మేడపాటి కల్పించారు. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్‌ నాయకులు దొంగ ఓట్లు నమోదు చేశారంటూ మేడపాటి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దీంతో అధికారులు సదరు ఓట్లను గుర్తించి తొలగించారు. ఈ నేపథ్యంలో మేడపాటి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అర్వింద్‌ ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు సాధించడంతో బీజేపీ టిక్కెట్లకు డిమాండ్‌ పెరిగింది. తాజాగా టిక్కెట్ల ఖరారుపై పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
దినేశ్‌1
1/3

దినేశ్‌

ప్రకాశ్‌రెడ్డి2
2/3

ప్రకాశ్‌రెడ్డి

3
3/3

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement