ఆర్‌అండ్‌బీ అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌బీ అస్తవ్యస్తం

Published Mon, Mar 3 2025 1:24 AM | Last Updated on Mon, Mar 3 2025 1:21 AM

ఆర్‌అండ్‌బీ అస్తవ్యస్తం

ఆర్‌అండ్‌బీ అస్తవ్యస్తం

నిజామాబాద్‌నాగారం: ఉన్నతాధికారి నుంచి సబ్‌ డివిజన్‌ వరకు పోస్టులు ఖాళీగా ఉండడంతో రోడ్లు, భవనాల శాఖలో పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ), నిజామాబాద్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌(ఈఈ) పో స్టులతోపాటు డిప్యూటీ ఈఈ, ఆయా సబ్‌ డివిజన్‌ లలో ఏఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో సెక్షన్‌ కార్యాలయాల్లో పాలన అస్త్యవస్తంగా మారింది.

జిల్లాకు రాని ఇన్‌చార్జి ఎస్‌ఈ

ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌, కామారెడ్డి) ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఎస్‌ఈగా విధులు నిర్వర్తించిన హన్మంత్‌రావు మూడు నెలల కిందటే సీఈగా పదోన్నతి, ఉద్యోగ విరమణ పొందిన విషయం తెలిసిందే. దీంతో సంగారెడ్డి జిల్లా ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) వసంత్‌నాయక్‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే ఆయన నెలకు ఒక్కసారి కూడా జిల్లాకు వచ్చేందుకు ఇష్టపడడం లేదని శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఫైళ్లపై సంతకాలు అవసరం ఉంటే తామే సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఐదు సబ్‌ డివిజన్‌లు ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బాల్కొండ ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ ద్వారానే రోడ్ల విస్తరణ, అభివృద్ధి, బ్రిడ్జీ నిర్మాణం తదితర పనులు కొనసాగుతున్నాయి. పర్యవేక్షించాల్సిన ముఖ్య అధికారి పోస్టు మాత్రం ఖాళీగా ఉంది.

పాలన అస్తవ్యస్తం

ఆర్‌ అండ్‌ బీలో నెలల తరబడి కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ఎస్‌ఈ లేకపోగా, నిజామాబాద్‌ డివిజన్‌ ఈఈ సైతం ఇన్‌చార్జి కొనసాగుతున్నారు. సబ్‌ డివిజన్‌లో ఏఈలు సరిపడా సంఖ్యలో లేకపోవడంతో పనులు మూడు అడుగుల ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని అటు శాఖ సిబ్బంది, ఇటు ప్రజలు కోరుతున్నారు.

ఫీల్డ్‌ అనుభవం లేని ఈఈకి బాధ్యతలు..

ఎస్‌ఈ నుంచి ఈఈ వరకు

ఇన్‌చార్జీలే..

నెలకోసారైనా జిల్లా

ముఖం చూడని అధికారి

ఉన్నతాధికారి సంతకం కోసం

సంగారెడ్డికి పరుగులు

సబ్‌ డివిజన్‌కు ఒక్కరే ఏఈ

పనులపై పర్యవేక్షణ కరువు

ఖాళీలు భర్తీ అయ్యేనా..?

నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో బాల్కొండ, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఐదు సబ్‌ డివిజన్‌ కార్యాలయాలున్నాయి. ఒక్కో సబ్‌ డివిజన్‌కు డిప్యూటీ ఈఈతోపాటు ముగ్గురు ఏఈలు ఉండాలి. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

బాల్కొండ సబ్‌ డివిజన్‌కు డిప్యూటీ ఈఈ లేకపోవడంతో ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ డిప్యూటీ ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో సబ్‌ డివిజన్‌లో ఒక్కో ఏఈ మాత్రమే ఉండడంతో తమపై పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు చేయాల్సిన పనులు ఒక్కరే చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఐదు సబ్‌డివిజన్‌లను పర్యవేక్షించాల్సిన ఈఈ పోస్టు గత నెల 28న ఖాళీ అయ్యింది. ఇది వరకు ఈఈగా విధులు నిర్వర్తించిన సురేశ్‌ పదవీవిరమణ పొందగా, సర్కిల్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్‌ డిప్యూటీ ఈఈ శ్రీమాన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉన్నప్పటికీ ఫీల్డ్‌ అనుభవం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement