
హౌసింగ్‌లో ఆ నలుగురే!
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఉద్యోగుల కొరత ప్రభావం చూపనుంది. ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని భారీగా నిర్దేశించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల సంఖ్య పెంపుపై దృష్టి సారించడం లేదు.
సొంత స్థలం, అర్హత ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం అందించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఒక్కో ని యోజకవర్గంలో తొలి విడతలో 3,500 ఇళ్లకు సా యం అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశా రు. అందులో భాగంగానే గృహ నిర్మాణ సంస్థకు మరోసారి జీవం పోశారు. లక్ష్యానికి అనుగుణంగా ఇళ్లను నిర్మించడంతోపాటు ప్రభుత్వం అందించే సాయం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో పక్కా పర్యవేక్షణకు గృహ నిర్మాణ సంస్థలో ఇంజినీర్లను నియమించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇద్దరు డిప్యూటీ ఇంజినీర్లు, మరో ఇద్దరు ఏఈఈలను మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. గతంలో హౌసింగ్ సంస్థలో విధులు నిర్వహించి మరో ఇంజినీరింగ్ శాఖకు బదిలీ అయిన అధికారులను వారి మాతృశాఖలోకి ఆహ్వానించారు. జిల్లా అంతటా తొలి విడతలో 18,500 ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించే అవకాశం ఉంది. కానీ, ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నలుగురు ఇంజినీర్లు మాత్రమే ఉండడంతో వారిపై పనిభారం పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు ఏఈఈలు, మండలానికి నలుగురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించేవారు. డివిజన్‌కు ఒక డిప్యూటీ ఇంజినీర్ పర్యవేక్షించేవారు.
ఎంపీడీవోలే బిల్లులు చెల్లించేలా..
ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేవారికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల సాయం అందించనున్నారు. అందుకోసం ఎంపీడీవోల ఫోన్‌లలో ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారు. బిల్లుల తయారీ, చెల్లింపుల బాధ్యత గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లపై లేకున్నా పర్యవేక్షణ అంశం వారిదే కావడం గమనార్హం. హౌసింగ్ ఉద్యోగులే మార్కింగ్ ఇచ్చి ఇంటి నిర్మాణం పూర్త య్యే వరకూ అన్ని దశలను పర్యవేక్షించి నివేదికను సమర్పించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా నలుగురే అధికారులు ఉండడంతో నిర్దేశిత సమయంలో పరిశీలన పూర్తవుతుందా అనే సంశయం నెలకొంది.
లక్ష్యం మాత్రం కొండంత
జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఇంజినీర్లు, ఇద్దరు ఏఈఈలు
‘ఇందిరమ్మ ఇళ్ల’పై ప్రభావం చూపే అవకాశం
తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణ లక్ష్యం
పెరగనున్న పనిభారం
Comments
Please login to add a commentAdd a comment