
పెరుగుతున్న ఫిర్యాదులు
సిరికొండ: పాలనలో పారదర్శకతకు బాటలేయాలి.. అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించాలి.. అవినీతిని కాగడపెట్టి తరిమేయాలి.. ప్రజాధనం దు ర్వినియోగం కాకుండా పరిరక్షించాలి.. అనే సంకల్పంతో అమలులోకి వచ్చిన ఏకై క చట్టం సమాచార హక్కు (సహ)చట్టం. కానీ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో స.హ. చట్టం అమలుకు ఏర్పడిన సమాచార కమిషన్ సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధిస్తున్నా తీరు మారడం లేదు. సాధారణ సమాచా రం అయితే ఇస్తున్నారు కానీ అవినీతి గల సమా చారం లోపాలు గల సమాచారం ఇవ్వడం లేదు.
అధికారుల కప్పదాటు వైఖరి
సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 ద్వారా వచ్చిన దరఖాస్తులను సదరు ప్రజా సమాచార అధికారులు పట్టించుకోవడం లేదు. సెక్షన్7(1) ప్రకారం 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో స.హ.చట్టంపై శిక్షణ పొందుతున్న అధికారులు నిబంధనలను మాత్రం పాటించడం లేదు. జక్రాన్‌పల్లి మండలానికి చెందిన ఓ దరఖాస్తుదారుడు ఆర్మూర్ విద్యుత్ డివిజన్ కార్యాలయానికి స.హ. దరఖాస్తు చేస్తే అది నిజామాబాద్ డివిజన్‌కు చెందిన సమాచారం కావున సెక్షన్ 6(3) ప్రకారం ఐదు రోజుల్లో దరఖాస్తును బదిలీ చేయాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన సమాచారం మా దగ్గర లేదని సమాచారం ఇచ్చారు. స.హ. చట్టం ప్రాథమిక అంశాలు తెలిసిన కూడా సదరు పీఐవో సహ చట్టం గురించి నాకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించారు. అలాగే కామారెడ్డి జిల్లాలో రెవెన్యూ, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు సమాచారం ఇవ్వడం లేదంటు ఇటీవల కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రజాప్రతినిధికి సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగితే సామాన్య పౌరుల పరిస్థితి ఏంటని స.హ. ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో చాలా కార్యాలయాలు 4(1) బీకి చెందిన 17 అంశాలు స్వచ్ఛందంగా వెల్లడించడం లేదు. జిల్లా శాఖలో మూడు నెలలకోసారి జరగాల్సిన సమీక్ష సమావేశాలు జరగడం లేదు. నిజామాబాద్ జిల్లా విద్యా శాఖలో సమాచారం ఇవ్వడంలో అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఓ విషయంలో గతంలో వచ్చిన తీర్పులను అన్ని విషయాలు జోడిస్తూ సెక్షన్8 ని సాకుగా చూపి సమాచారం ఇవ్వడంలో సదరు పౌరసమాచార అధికారిణి సహాయ నిరాకరణ చేస్తున్నారు.
సమాచార కమిషనర్లు లేక గుట్టలుగా
పెరుగుతున్న అప్పీళ్లు, ఫిర్యాదులు
సమీక్షలు లేవు, కానరాని
4(1) బి సమాచారం
ఉమ్మడి జిల్లాలో స.హ. చట్టం సమాధి
పై మూడు ఉదాహరణలు చాలు. ఉమ్మడి జిల్లాలో స.హ. చట్టం అమలు అధ్వాన స్థితి గురించి. ప్రజలకు ప్రశ్నించేతత్వాన్ని నేర్పిన స.హ. చట్టం రెండు దశాబ్దాలుగా ఎన్నో అక్రమాలను బయటపెట్టింది. కానీ ఇది నాణానికి ఒక పార్శ్యం మాత్రమే. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో స.హ. చట్టం అమలు తీరు అధ్వానంగా ఉంది. సాధారణ సమాచారం కూడా సరిగా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో సమాచార కమిషనర్లు లేక అధికారులు స.హ. చట్టానికి విలువ ఇవ్వడం లేదు. మరో పక్క కమిషన్‌లో అప్పీళ్లు, ఫిర్యాదులు కొండల్లా పెరిగి సామాన్య పౌరులకు సమాచారం అందని ద్రాక్షగా మారింది.
గత ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 2023లో సమాచార కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో కమిషన్ ఖాళీ అయింది. అప్పటి వరకు ఉమ్మడి జిల్లా నుంచి 371 అప్పీళ్లు, 232 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించక పోవడంతో అప్పీళ్లు, ఫిర్యాదులు కొండల్లా పెరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్ల నియామకం గురించి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి 476 అప్పీళ్లు, 283 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. కమిషనర్లు లేకపోవడంతో స.హ. చట్టానికి విలువ లేకుండా పోతోంది. ఉమ్మడి జిల్లాలో ప్రజా సమాచార అధికారులు సమాచారం ఇవ్వడంలో అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారు.
కమిషనర్లను నియమించాలి
రాష్ట్రంలో సమాచార కమిషనర్ల నియామకం గత రెండేళ్లుగా జరగలేదు. దీంతో స.హ. చట్టం పక్కాగా అమలు కావడం లేదు. 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. 4(1)బి 17 అంశాలు స్వచ్ఛందంగా వెల్లడించడం లేదు. – మహేందర్‌గౌడ్,
స.హ. రక్షణ వేదిక జిల్లా కోకన్వీనర్
స.హ. చట్టానికి విలువేది
జిల్లాలో అన్ని శాఖల ప్రజాసమాచార అధికారులకు శిక్షణ ఇస్తున్నా కనీస ప్రాథమిక అంశాలను కూడా పాటించడం లేదు. సమాచారం కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు. దరఖాస్తు బదిలీ నిర్ణీత సమయంలో చేయడం లేదు.
– భాస్కర్, స.హ. రక్షణ వేదిక ప్రతినిధి

పెరుగుతున్న ఫిర్యాదులు

పెరుగుతున్న ఫిర్యాదులు