
చిన్నారులను బలిగొన్న లారీ
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● ఒకరికి తీవ్రగాయాలు
ఆర్మూర్‌టౌన్: వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తు న్న ఇద్దరు చిన్నారులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారి బైపాస్ మార్గంపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓంకార్(14), భానుప్రసాద్(11) అనే ఇద్దరు బాలురు దుర్మరణం చెందగా విశ్వనాథ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణానికి చెందిన బంజ విశ్వనాథ్, లక్ష్మి దంపతుల కుమారుడు ఓంకార్ జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ వసతిగృహంలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓంకార్ ఇంటి పక్కనే ఉండే స్నేహితుడు భానుప్రసాద్‌తో కలిసి ఉదయం వరకు ఆడుకున్నారు. కాగా, విశ్వనాథ్ పెర్కిట్‌లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓంకార్, భాను ప్రసాద్‌ను తీసుకొని బైక్‌పై బయలుదేరాడు. పెర్కిట్ జాతీయ రహదారి బైపాస్ మార్గం వద్ద రోడ్డు దాటుతుండగా నిర్మల్ వైపు నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. భానుప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకులు విశ్వనాథ్, ఓంకార్‌ను పోలీసులు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఓంకార్ మరణించాడు. విశ్వనాథ్‌ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఇరుకుటుంబాల వారు తమ పిల్లలు ఇక లేరని తెలుసుకొని గుండెలవిసేలా విలపించారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

చిన్నారులను బలిగొన్న లారీ

చిన్నారులను బలిగొన్న లారీ