
డిచ్‌పల్లి ఖిల్లాకు గుర్తింపు తెస్తా..
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
డిచ్‌పల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన డిచ్‌పల్లి ఖిల్లా రామాలయానికి ఎకో టూరిజం ద్వారా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. త్వరలో బాసర టూరిజం సర్క్యూట్‌లో డిచ్‌పల్లి రామాలయాన్ని చేర్చుతామని వెల్లడించారు. బుధవారం డిచ్‌పల్లి రామాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రామాలయంపై తీసుకున్న ప్రతి నిర్ణయం విజయవంతమైందని, తాను నామినేషన్ వేసే ముందు ఈ గుడికి వచ్చి వెళ్లగా, ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు తెలిపారు. ఆలయాభివృద్ధికి ప్రత్యేక నిధులను తీసుకువస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం నూతన చైర్మన్‌గా జంగం శాంతయ్య, డైరెక్టర్లుగా నర్సారెడ్డి, జితేందర్, పోశె ట్టి, మాధురి, ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ శర్మలతో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కమల ప్రమా ణ స్వీకారం చేయించారు. నాయకులు బూస సుదర్శన్, పీ మహేందర్ రెడ్డి, నర్సారెడ్డి, రాములు, సాయిలు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఆరు గ్రామాల్లో రూ.11.69కోట్లతో..
గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. గ్రామాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. మండలంలోని మిట్టపల్లి, రాంపూర్, నర్సింగపూర్, కమలాపూర్, డిచ్‌పల్లి, ఘన్‌పూర్ గ్రామాల్లో రూ.11.69 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, నాయకులు తారాచంద్, వాసు బాబు, ధర్మాగౌడ్, మురళి చిన్నయ్య, రామకృష్ణ, షాదుల్లా, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.