
పడిపోయిన నువ్వుల ధర
మోర్తాడ్(బాల్కొండ): నువ్వుల ధర పడిపోవడంతో పంట సాగు చేసిన రైతుల ముఖాల్లో నవ్వులు కరువయ్యాయి. యాసంగి సీజన్‌లో సాగు చేసిన నువ్వులకు ఆశించిన ధర లభించడం లేదు. గతేడాదితో పోలిస్తే క్వింటాల్‌కు రూ.4వేల వరకు ధర పడిపోయింది. కరోనా కాలంలో నువ్వులకు గిరాకీ, ధర పెరగింది. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్‌లో జిల్లాకు చెందిన రైతులు సుమారు రెండున్నర వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు అయినట్లు అంచనా. నువ్వులకు ప్రధాన మార్కెట్ పుణే కాగా అక్కడికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుండడంతో తెలంగాణ నువ్వులకు డిమాండ్ తగ్గింది. గతేడాది స్థానికంగా క్వింటాల్‌కు గరిష్టంగా రూ.13,700 చెల్లించిన వ్యాపారులు ఈ ఏడాది మాత్రం రూ.9,700 నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నారు. తెలంగాణలో సాగు చేస్తున్న నువ్వులకు డిమాండ్ తగ్గిపోవడంతో ధర పడిపోయిందని వెంకటేశ్ అనే వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. ఏకంగా రూ.4వేల వరకు ధర తగ్గిపోవడంతో నువ్వులు సాగు చేసిన రైతులకు లాభాలు పడిపోయి శ్రమకు తగిన ప్రయోజనం లేకుండా పోయింది.
రూ.13,700 నుంచి రూ.9,700కు..
క్వింటాల్‌కు రూ.4 వేల వరకు
తగ్గిన రేటు
ప్రధాన మార్కెట్ మహారాష్ట్రలోని పుణేలో..
ఏపీ, గుజరాత్ నుంచి అక్కడికి దిగుబడులు
తెలంగాణ నువ్వులకు తగ్గిన డిమాండ్